Maharashtra: పిల్లి వల్ల 100 కోట్ల నష్టం.. మహారాష్ట్రలో వింత ఘటన..!

  • Written By:
  • Updated On - March 24, 2022 / 12:31 PM IST

ఎంత పని చేశావే పిల్లి.. ఉన్నచోట ఉండకుండా ట్రాన్స్ ఫార్మర్ ఎక్కావు.. ఆ దెబ్బకు వంద కోట్ల నష్టానికి కారణమయ్యావు. అంతేనా 60 వేల విద్యుత్ కనెక్షన్లు తెగిపోయేలా చేశావు. అసలు ఏం జరిగిందంటే..మహారాష్ట్రలోని పుణె పట్టణం శివార్లలో పింప్రీ-చించ్వడ్ ప్రాంతముంటుంది. అక్కడ వ్యాపారాలు ఎక్కువగా జరుగుతాయి. కానీ ఓ పిల్లి.. అక్కడున్న మహా ట్రాన్స్ మిషన్ సబ్ స్టేషన్ లోని ట్రాన్స్ ఫార్మర్ మీదకు ఎక్కింది. అసలు కథ అక్కడే మొదలైంది.

ఇక్కడ పారిశ్రామిక ప్రాంతమైన భోసారిలో వ్యాపారస్తులు ఎక్కువ. ఆ పిల్లి ట్రాన్స్ ఫార్మర్ మీదకు ఎక్కడంతో షార్ట్ సర్క్యూ్ట్ అయ్యింది. దీంతో భోసారితోపాటు భోసారి ఎం.ఐ.డి.సి…. అంటే భోసారి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 60 వేల మంది విద్యుత్ వినియోగదారులకు కరెంట్ సరఫరా కట్ అయ్యింది. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న దాదాపు 7000 మంది వ్యాపారస్తుల దుకాణ సముదాయాలకూ కరెంట్ సప్లయ్ నిలిచిపోయింది.

ఇన్నివేల మంది విద్యుత్ కష్టాలకు కారణం.. పిల్లి. ఇది చేసిన పని వల్ల దాదాపు రూ.100 కోట్ల రూపాయిలకు పైగా నష్టం వాటిల్లి ఉంటుందని ప్రస్తుతానికి అంచనా వేశారు. విద్యుత్ శాఖా మంత్రితోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులు కలగజేసుకున్నా సరే.. మొత్తం సరఫరాను మళ్లీ పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలంటే.. కచ్చితంగా మూడు రోజులైనా పడుతుంది. దీంతో ఇన్నివేల మందీ అప్పటివరకు విద్యుత్ వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.

ఇప్పటికైతే విద్యుత్ ను పొదుపుగా వాడుకోవాలని.. ఎందుకంటే సింగిల్ ట్రాన్స్ ఫార్మర్ పైనే మొత్తం లోడ్ పడుతోందంటున్నారు విద్యుత్ శాఖా అధికారులు. అయినా ఇంతటి నష్టానికి, కష్టానికి కారణం.. పిల్లి అంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. అయినా ఇది నిజం. పిల్లి శాపాలకు ఉట్టి తెగదు అన్న సామెత మాటేమో కాని.. కష్టాలు, నష్టాలు తప్పవన్నది అర్థమైంది.