గంగాసాగర్‌లో పుణ్యస్నానానికి వెళ్లిన భక్తులు బంగాళాఖాతంలో చిక్కుకున్నారు. అలా రాత్రంతా అక్కడే గడిపారు. వారిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన దాదాపు 600 మంది భక్తులు (600 Devotees) 24 పరగణాల జిల్లా గంగాసాగర్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సమయంలో దట్టమైన పొగమంచు, గాలి కారణంగా బంగాళాఖాతంలో రెండు పడవలు కూడా బురదలో కూరుకుపోయాయి. దీంతో యాత్రికులు రాత్రంతా సముద్రంలో గడపాల్సి వచ్చింది.
కాక్‌ద్వీప్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. భక్తులందరికీ రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టారు. కోస్ట్ గార్డ్ సిబ్బందిని రంగంలోకి దింపామని.. సాయం కోసం హోవర్ క్రాఫ్ట్ ను కూడా పంపామని వివరించారు. హుగ్లీ నది-బంగాళాఖాతం సంగమం దగ్గర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు దాదాపు 500 నుంచి 600 మంది భక్తులు రెండు పడవల్లో వెళ్లినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది.
Also Read: Jr NTR Met India cricketers: టీమిండియా క్రికెటర్లను కలిసిన జూ. ఎన్టీఆర్
పొగమంచు, సముద్రం ఉప్పొంగడంతో నీరు తగ్గి రెండు ఫెర్రీలు బురదలో కూరుకుపోయాయి. కాగా.. సమాచారం అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. యాత్రికులకు ఆహారంతోపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాలని అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది. పొగమంచు కారణంగా గంగాసాగర్ నుంచి యాత్రికులను తీసుకురావడానికి అంతరాయం ఏర్పడుతుందని చెబుతున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా దాదాపు 10 లక్షల మంది భక్తులు గంగాసాగర్‌లో స్నానాలు చేశారు. దాదాపు 51 లక్షల మంది గంగాసాగర్‌ను సందర్శించి పూజలు చేశారు. ఇక్కడ పుణ్యస్నానం చేస్తే పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం.