త్రిపుర (Tripura)లో బీజేపీ విజయాన్ని సీపీఎం- కాంగ్రెస్ కూటమి అడ్డుకోగలదా..? ప్రద్యోత్ దేబ్‌బర్మ కింగ్ మేకర్‌గా అవతరిస్తారా..? రాజకీయ పార్టీల భవితవ్యాన్ని తేల్చేందుకు రెడీ అయ్యారు త్రిపుర ఓటర్లు. రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యింది. మొత్తం 60 స్థానాలకు గురువారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అధికార బీజేపీ, లెఫ్ట్- కాంగ్రెస్ కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీ తలపడుతున్నాయి. గడిచిన నెల రోజులుగా పోటాపోటీ ప్రచారం నిర్వహించాయి.
త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 259 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 20 మంది మహిళలు ఉన్నారు. 55 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది అధికార బీజేపీ. మిత్రపక్షం IPFTకి ఆరు చోట్ల పోటీచేస్తోంది. సీపీఎం 47 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థులు 13 స్థానాల్లో బరిలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేస్తోంది. దాదాపు 28.13 లక్షల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొననున్నారు. మొత్తం 3వేల328 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఈసీ ప్రకటించింది.
Also Read: Petrol Prices: వాహనదారులకు గుడ్ న్యూస్… తగ్గనున్న పెట్రోల్, డీజిల్.. ఎప్పటి నుంచంటే!
సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లుచేసింది. 400 కంపెనీల పారమిలటరీ బలగాలను రాష్ట్రంలో ఈసీ మోహరించింది. 25ఏళ్లు వామపక్ష పాలనలో ఉన్న త్రిపురలో 2018లో చరిత్రాత్మక విజయం సాధించింది బీజేపీ. ఈసారి అధికారం నిలబెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. బీజేపీకి చెక్ పెట్టేందుకు లెఫ్ట్ పార్టీలు- కాంగ్రెస్ కూటమిగా బరిలో దిగాయి. గిరిజనుల ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న త్రిపుర రాజకుటుంబీకుడు ప్రద్యోత్ మాణిక్య దేబ్‌బర్మ కింగ్ మేకర్‌గా అవతరించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్రేటర్ తిప్రాల్యాండ్ నినాదంతో.. కీలకమైన 20 గిరిజన స్థానాల్లో తిప్రా మోత పోటీచేస్తోంది. ఫిబ్రవరి 27న మరో రెండు ఈశాన్య రాష్ట్రాలు నాగాలండ్, మేఘాలయల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం త్రిపుర సహా మూడు రాష్ట్రాల్లో మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనుంది.