Site icon HashtagU Telugu

Himachal Pradesh: ఆరుగురు కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు

6 Congress Mlas Disqualifie

6 Congress Mlas Disqualifie

Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల్లో(Rajya Sabha elections)పార్టీ విప్‌ను ధిక్కరించి విపక్ష అభ్యర్థికి ఓటేసిన ఆరుగురు కాంగ్రెస్‌(congress)తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయింది (Disqualified). కాంగ్రెస్ పిటిషన్‌ నేపధ్యంలో స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా(Speaker Kuldeep Singh Pathania)ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సభ్యత్వం రద్దయిన వారిలో ధర్మశాల ఎమ్మెల్యే సుధీర్ శర్మ, సుజన్‌పూర్ ఎమ్మెల్యే రాజిందర్‌ రాణా, కుత్లహర్ ఎమ్మెల్యే దేవేందర్‌ కుమార్‌ భుట్టో, గాగ్రెట్ ఎమ్మెల్యే చైతన్య శర్మ, లాహౌల్ స్పితి ఎమ్మెల్యే రవి ఠాకూర్, బాద్సర్ ఎమ్మెల్యే ఇంద్ర దత్ లఖన్‌పాల్ ఉన్నారు.

ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వీరిపై స్పీకర్ వేటువేశారు. ఈ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ(bjp) రాజ్యసభ ఎన్నికల అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఈనేపథ్యంలో ఆరుగురి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

మంగళవారం రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత ఈ 9మంది ఎమ్మెల్యేలు హర్యానాలోని పంచకులకు వెళ్లిపోయారు. అక్కడ వారికి బీజేపీ సర్కార్‌ కట్టుదిట్టమైన భద్రత కల్పించటం గమనార్హం. బుధవారం బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో సిమ్లాకు చేరుకున్నారు. బడ్జెట్‌ సమావేశాల్ని బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ముందు కాంగ్రెస్‌ సర్కార్‌ తన మెజార్టీ నిరూపించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్‌ చేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బయటకు పంపి.. రాష్ట్ర బడ్జెట్‌ను మూజువాణి పద్ధతిలో ఆమోదించారు. ఆ తర్వాత సభను స్పీకర్‌ నిరవధిక వాయిదా వేశారు. దీని కంటే ముందు బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ ప్రతాప్‌ శుక్లాను కలుసుకొని, కాంగ్రెస్‌ సర్కార్‌ మెజార్టీ నిరూపించుకోవాలని గవర్నర్‌ను కోరారు. మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న తరుణంలో తాజా పరిణామాలు కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేశాయి.

కాగా, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు స్పష్టం చేశారు. 68 స్థానాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీకి 2022లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌-40, బీజేపీ-25, స్వతంత్రులు-3 స్థానాలు గెలుచుకున్నారు. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేశారు. వారిపై స్పీకర్‌ అనర్హత వేటువేయండంతో కాంగ్రెస్‌ బలం 34కు పడిపోయింది.

read also : Rashmika Mandanna: జపాన్‌కు బయల్దేరిన రష్మిక.. అందుకోసమేనా?