Site icon HashtagU Telugu

Pak Nationals: వామ్మో.. ఆ రాష్ట్రంలో ఐదువేల మంది పాకిస్థానీ పౌరులు

Pak Visa Holders

Pak Visa Holders

Pak Nationals: జమ్మూక‌శ్మీర్ ప్రాంతం పహల్గాంలో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో 26మంది ప‌ర్యాట‌కులు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌ను కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ గా తీసుకుంది. ఈ ఉగ్ర‌దాడి వెనుక పాకిస్థాన్ హ‌స్తం ఉంద‌ని ఆధారాలు ల‌భ్య‌మ‌వుతున్నాయి. దీంతో పాకిస్థాన్ పై ప్ర‌తీకారం తీర్చుకునేందుకు భార‌త ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో సింధూ న‌దీ జ‌లాల ఒప్పందాన్ని నిలిపివేయ‌డంతోపాటు.. భార‌త‌దేశంలో ఉన్న పాకిస్థానీయులు వారం రోజుల్లో వెళ్లిపోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో స‌మావేశం అయ్యారు. ఆయా రాష్ట్రాల్లోని పాకిస్థానీయుల‌ను వెంట‌నే పంపించివేయాల‌ని ఆదేశించారు.

 

కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణయాన్ని అమ‌లుచేసే క్ర‌మంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు. పోలీసుల స‌మాచారం ప్ర‌కారం.. మహారాష్ట్ర రాష్ట్రంలో మొత్తం 5023 మంది పాకిస్తానీ పౌరులు ఉన్నారు. నాగ్‌పూర్ ప్రాంతంలో 2458 మంది, థానే నగరంలో 1106 మంది, ముంబైలో 14 మంది పాకిస్తానీ పౌరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాక‌.. జల్గావ్‌లో 393, నవీ ముంబైలో 239, పింప్రి చించ్వాడ్‌లో 290, ఛత్రపతి సంభాజీనగర్, ఇతర జిల్లాల్లో 58 మంది.. ఇలా మొత్తం మహారాష్ట్రలో 5023 మంది పాకిస్తానీయులు ఉంటున్న‌ట్లు పోలీసులు తేల్చారు. వీరిలో వంద‌ల సంఖ్య‌లో పాకిస్థానీల వ‌ద్ద‌ మాత్రమే చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉన్న‌ట్లు గుర్తించారు.

 

మంత్రి యోగేష్ కదమ్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో దీర్ఘకాలిక వీసాలపై దాదాపు 4వేల మంది పాకిస్థానీయులు ఉండగా.. సార్క్ వీసా కింద మరో 1000 మంది ఉన్నారని తెలుస్తోంది. ఈ వెయ్యి మందిలో సినిమా ఇండస్ట్రీ, మెడికల్, జర్నలిజం, వ్యక్తిగత పనుల కోసం మహారాష్ట్రకు వచ్చిన వారు ఉన్నారని మంత్రి వెల్లడించారు. వీరిలో కొందరు 10 ఏళ్లుగా మన దేశంలోనే ఉంటున్నారని, కొందరు పాకిస్తాన్ పౌరులు.. స్థానికంగా వివాహాలు చేసుకోగా.. మరికొందరు తమ పాకిస్తాన్ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేసి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా.. షార్ట్ టెర్మ్ వీసాలపై భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ వాసులు ఆదివారం లోగా తప్పనిసరిగా దేశం విడిచి వెళ్లిపోవాలని మంత్రి యోగేష్ కదమ్ తేల్చి చెప్పారు. అయితే మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన వారికి మాత్రం మానవతా దృక్పథంతో అదనంగా మరో రెండు రోజులు మాత్రమే సమయం ఇస్తామని చెప్పారు.