Site icon HashtagU Telugu

Delhi To Hamas : ఢిల్లీలో బట్టబయలైన ‘హమాస్’ క్రిప్టో ఫండ్స్ బాగోతం

Delhi To Hamas

Delhi To Hamas

Delhi To Hamas : ఇజ్రాయెల్ తో యుద్ధం చేసే స్థాయికి పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్ ఎలా ఎదిగింది ? వేలాది రాకెట్లు దానికి ఎక్కడి నుంచి వచ్చాయి ? ఆ సంస్థకు నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయి ? అనే దానిపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది.  రెండేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారికి చెందిన క్రిప్టో వ్యాలెట్ హ్యాకింగ్ కు గురై.. దాని నుంచి రూ.4.5 కోట్లు విలువైన క్రిప్టో కరెన్సీ మాయమైంది. దీనిపై ఇన్వెస్టిగేషన్ చేసిన ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది.  దర్యాప్తు క్రమంలో ఆ వ్యాపారి క్రిప్టో వ్యాలెట్ నుంచి డబ్బు ఎక్కడికి వెళ్లిందనే వివరాలను ఢిల్లీ పోలీసులు తెలుసుకోలేకపోయారు. దీంతోవారు ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మోసాద్ సహాయాన్నికోరారు. దీంతో మోసాద్.. కొన్ని అనుమానిత క్రిప్టో వ్యాలెట్ల చిట్టాను ఢిల్లీ పోలీసులకు పంపించింది. దాన్ని చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఢిల్లీ వ్యాపారి క్రిప్టో అకౌంట్ హ్యాక్ అయ్యాక.. పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్ కు చెందిన ‘అల్ కస్సామ్ బ్రిగేడ్’  క్రిప్టో అకౌంట్ కు రూ.4.5 కోట్లు విలువైన క్రిప్టో కరెన్సీ చేరిందని  గుర్తించారు.

We’re now on WhatsApp. Click to Join

ఢిల్లీ వ్యాపారి కేసును మాజీ డీసీపీ (స్పెషల్ సెల్) కేపీఎస్ మల్హోత్రా బృందం ఇన్వెస్టిగేట్ చేసింది. హమాస్ సైబర్ వింగ్ అల్ కస్సామ్ బ్రిగేడ్‌లకు సంబంధించిన అనేక వాలెట్‌లను దర్యాప్తులో  గుర్తించామని మల్హోత్రా తాజాగా మీడియాకు వెల్లడించారు. దీనిపై తొలుత 2019లో ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవగా, కోర్టు ఆదేశాలపై దాన్ని ఢిల్లీ స్పెషల్ సెల్‌కు బదిలీ చేశారు. ఈకేసులో హమాస్ లింక్ బయటపడిన తర్వాత గాజాలోని నసీర్ ఇబ్రహీం అబ్దుల్లా, గాజాలోని అహ్మద్ మర్జూక్, పాలస్తీనాలోని రమల్లాలో అహ్మద్ క్యూహెచ్ సఫీ అనే హమాస్ కార్యకర్తల క్రిప్టో అకౌంట్లను సీజ్ చేశారు. క్రిప్టోకరెన్సీ నిధులను వివిధ వాలెట్ల ద్వారా మళ్లించి.. చివరకు హమాస్ ఉగ్రవాదుల వ్యాలెట్లలోకి పంపారని దర్యాప్తులో బట్టబయలైంది. ఈనేపథ్యంలో క్రిప్టో కరెన్సీ అకౌంట్లను హ్యాక్ చేస్తున్న ముఠా ఎక్కడిది ? హ్యాక్ చేసిన అకౌంట్ల నుంచి డబ్బులను హమాస్ అకౌంట్లకు ఎందుకు పంపిస్తున్నారు ? అనేది తెలియాల్సి ఉంది.  ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఇంకా దీనిపై (Delhi To Hamas)  దర్యాప్తు చేస్తోంది.

Also read : International Girl Child Day : ఆ చిరునవ్వులు చెరగనీయొద్దు..

Exit mobile version