Uttarakhand Violence : నలుగురి మృతి.. 250 మందికి గాయాలు.. మదర్సా కూల్చివేతతో ఉద్రిక్తత

Uttarakhand Violence : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Published By: HashtagU Telugu Desk
Uttarakhand Violence

Uttarakhand Violence

Uttarakhand Violence : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని వన్‌భుల్‌పురా ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఒక మదర్సా,  ఓ మసీదును స్థానిక మున్సిపల్ అధికారులు పోలీసు భద్రత నడుమ గురువారం కూల్చేయడంతో చోటుచేసుకున్న హింసాకాండలో(Uttarakhand Violence) నలుగురు చనిపోయారు.  ఓ వర్గానికి చెందిన పలువురు జరిపిన రాళ్ల దాడిలో 250 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పోలీసులే ఎక్కువ మంది ఉన్నారు.  రాళ్ల దాడి టైంలో అక్కడున్న మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం వారందరికీ స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

పోలీసులు టియర్ గ్యాస్‌ ప్రయోగించినా అల్లరి మూకలు వెనక్కి తగ్గలేదు. సమీపంలోని పోలీస్ స్టేషన్ ఎదుట పార్క్ చేసిన దాదాపు 20కిపైగా వాహనాలకు నిప్పు పెట్టారు. దగ్ధమైన వాటిలో టూ వీలర్స్, బైక్స్, పోలీసుల బస్సులు, జీపులు ఉన్నాయి. ఈనేపథ్యంలో పట్టణంలో ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ప్రస్తుతం హల్ద్వానీ పట్టణంలో కర్ఫ్యూ అమలవుతోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపారు.

Also Read : ISRO Weather Satellite : 17న నింగిలోకి ఇస్రో వాతావరణ ఉపగ్రహం.. మనకేం లాభమో తెలుసా ?

సీఎం ధామి ఏమన్నారంటే.. 

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ.. కోర్టు ఆదేశాల తర్వాతే మసీదు, మదర్సా కూల్చివేతకు అధికారుల బృందాన్ని పంపించామని వెల్లడించారు. ఆ ప్రాంతంలోని కొందరు వ్యక్తులు  పోలీసులతో ఘర్షణకు దిగారని..  ఆ ఘర్షణే  ప్రస్తుత పరిస్థితికి దారితీసిందని ముఖ్యమంత్రి చెప్పారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి అదనపు పోలీసులు, కేంద్ర బలగాలను మోహరిస్తున్నామన్నారు. శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.  దీనిపై హల్ద్వానీ  మున్సిపల్ కమిషనర్ పంకజ్ ఉపాధ్యాయ్ స్పందిస్తూ.. ‘‘మదర్సా, మసీదులను చట్టవిరుద్ధంగా నిర్మించారు.  గతంలోనూ హల్ద్వానీ మున్సిపాలిటీ అధికారులు ఈ వివాదాస్పద స్థలానికి సమీపంలోని మూడు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని, అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను సీజ్ చేశారని తెలిపారు.  హింసను ఆపే ఉద్దేశంతో సీఎం ధామి కనిపిస్తే కాల్చివేత ఆర్డర్స్ జారీ చేశారని పేర్కొన్నారు.

హైకోర్టులో పిల్ ఉండగానే.. 

మదర్సా, మసీదుల కూల్చివేతను ఆపేయాలంటూ ఉత్తరాఖండ్ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై గురువారం కోర్టు విచారణ జరిపినప్పటికీ.. ఎలాంటి ఆర్డర్స్ జారీ చేయలేదు. తదుపరి విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది. ఈనేపథ్యంలో విషయం కోర్టు పరిధిలో ఉండగానే గురువారం రోజే మున్సిపల్ అధికారులు మసీదు, మదర్సాలను  కూల్చేయడం గమనార్హం.

  Last Updated: 09 Feb 2024, 08:53 AM IST