Parliament Security : మే 20 (సోమవారం) నుంచి పార్లమెంటు సెక్యూరిటీ బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) చేపట్టనుంది. దాదాపు 3,317 మందికిపైగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని ఇందుకోసం మోహరించనున్నారు. ఇప్పటివరకు సీఆర్పీఎఫ్‌కు చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్(పీడీజీ)లోని 1400 మందికిపైగా సిబ్బంది పార్లమెంటుకు భద్రత కల్పించేవారు. రేపు ఉదయం 6 గంటల నుంచి పార్లమెంటు పూర్తిగా సీఐఎస్ఎఫ్ అదుపులోకి వెళ్లనుంది. పార్లమెంటు కాంప్లెక్స్‌లోని పాత పార్లమెంటు భవనం, కొత్త పార్లమెంటు భవనం, వాటి అనుబంధ నిర్మాణాలకు సీఐఎస్ఎఫ్ పహారా ఇవ్వనుంది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది గత 10 రోజులుగా పార్లమెంటు కాంప్లెక్స్‌ను అణువణువూ జల్లెడ పడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
- ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికనే సీఐఎస్ఎఫ్‌కు పార్లమెంటు భద్రతా విధులను అప్పగిస్తున్నారని.. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే దాన్ని పూర్తిస్థాయి సేవల కోసం అప్‌గ్రేడ్ చేయనున్నారని తెలుస్తోంది.
- పార్లమెంటులో విధులు నిర్వర్తించే సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సఫారీ సూట్‌లు, లేత నీలం రంగు ఫుల్ స్లీవ్ షర్టులు, బ్రౌన్ ప్యాంట్‌లు యూనిఫామ్‌గా ఉంటాయి.
- పార్లమెంట్ డ్యూటీ గ్రూప్‌లో భాగంగా సేవలందించిన పార్లమెంట్ సెక్యూరిటీ స్టాఫ్ (పీఎస్ఎస్)ను భవిష్యత్తులోనూ పార్లమెంటు ప్రాంగణంలో మార్షల్ విధుల కోసం, లాబీల పహారాకు వినియోగించే అవకాశం ఉంది.
- కొంతమంది పీఎస్ఎస్ సిబ్బందిని పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో భద్రత, ప్రోటోకాల్ విధుల కోసం మోహరించనున్నారు.
- పార్లమెంటు నుంచి సేవలను ఉపసంహరించుకోనున్న పార్లమెంట్ డ్యూటీ గ్రూపును సీఆర్పీఎఫ్ ఆరో బెటాలియన్‌కు చెందిన వీఐపీ భద్రతా విభాగంతో విలీనం చేయాలని యోచిస్తున్నారు.
- గతేడాది డిసెంబర్ 13న పార్లమెంటు భద్రతా ఉల్లంఘన వ్యవహారంతో దేశంలో కలకలం రేగింది. అప్పట్లో పార్లమెంట్ కాంప్లెక్స్ భద్రతా సమస్యలను పరిశీలించి తగిన సిఫార్సులు చేయడానికి సీఆర్పీఎఫ్ డీజీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
- మొత్తానికి కొన్ని దశాబ్దాల పాటు దేశ పార్లమెంటుకు(Parliament Security) సీఆర్పీఎఫ్ పటిష్టమైన భద్రతను అందించింది. ఎన్నో ఉగ్రదాడుల నుంచి పార్లమెంటును రక్షించడంలో కీలక పాత్ర పోషించింది.