Nagaland: నాగాలాండ్‌ లో కూలీలపై కాల్పుల కేసు.. 30 మంది ఆర్మీ సిబ్బందిపై ఛార్జ్ షీట్

నాగాలాండ్ లో సామాన్య కూలీలను తీవ్రవాదులుగా భావించి భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఘటనకు 6 నెలలు!!

  • Written By:
  • Publish Date - June 12, 2022 / 03:52 PM IST

నాగాలాండ్ లో సామాన్య కూలీలను తీవ్రవాదులుగా భావించి భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఘటనకు 6 నెలలు!! గతేడాది డిసెంబర్ 4న మోన్ జిల్లా ఓటింగ్ గ్రామానికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 13 మంది బొగ్గు గని కూలీలు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాల నిర్లక్ష్యం వీరి ప్రాణాలను బలిగొంది. ఈ కేసును విచారిస్తున్న నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వ ” సిట్‌ ” దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఓ ఆర్మీ అధికారి, 29 మంది జవాన్ల పేర్లు ఉన్నాయి. చార్జిషీట్‌లో పేర్కొన్న జవాన్లపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం నుంచి నాగాలాండ్ ప్రభుత్వం అనుమతి కోరింది. చర్యకు అనుమతి కోరుతూ రాష్ట్ర పోలీసులు రక్షణ శాఖకు లేఖ కూడా పంపారు.

ఆర్మీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో భాగమైన ప్రత్యేక ఆర్మీ బృందం కూడా ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. మేజర్ జనరల్ నేతృత్వంలోని కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ బృందం ఇప్పటికే ఓటింగ్ గ్రామాన్ని సందర్శించి సంఘటన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి స్థలాన్ని పరిశీలించింది. వాస్త‌వానికి ఆ స‌మ‌యంలో ఈశాన్య రాష్ట్రాల్లో అమ‌లులో ఉన్న AFSPA (సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం) నాగాలాండ్ లో కూడా అమ‌లులో ఉంది. ఈ చ‌ట్టం ప్ర‌కారం సైనిక బ‌ల‌గాల‌కు ప్ర‌త్యేక అధికారాలు ఉంటాయి. అంటే మిలిటెంట్లుగా భావించే ఎవరినైనా కాల్చి చంపినట్లయితే వారికి అరెస్టు, ప్రాసిక్యూషన్ నుంచి మిన‌హాయింపు ఉంటుంది.

ఈ ప్రత్యేక అధికారాల వ‌ల్లే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌నే ఆరోప‌ణ ఉంది. నాగాలాండ్ కాల్పుల ఘ‌ట‌న చోటు చేసుకున్న త‌రువాత ఈశాన్య రాష్ట్రాల్లో AFSPA ర‌ద్దు చేయాల‌ని పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. దీంతో అస్సాం, మణిపూర్, నాగాలాండ్‌లలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) పరిధిలోని ప్రాంతాలను త‌గ్గిస్తున్న‌ట్టు ఇటీవల కేంద్ర హోంశాఖ వెల్లడించింది.