Flood : ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. శనివారం కురిసిన భారీ వర్షానికి రాజేంద్రనగర్‌లోని రౌస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవనం బేస్‌మెంట్(Delhi Coaching Centre Basement) మొత్తం నీటిలో మునిగిపోయిన ఘటనలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అందులో విద్యార్థులు చిక్కుకున్నట్టు అగ్నిమాపక విభాగానికి శనివారం రాత్రి 7.20 గంటలకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఐదు ఫైర్ ఇంజిన్ల సహాయంతో బేస్‌మెంట్ నుంచి నీటిని బయటకు లాగారు. అయితే అప్పటికే ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి(Flood) ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join
హుటాహుటిన విద్యార్థుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బేస్‌మెంట్‌లో ఇంకా 7 అడుగుల మేర నీరు ఉందని సెంట్రల్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఎం హర్షవర్దన్ శనివారం రాత్రి మీడియాకు తెలిపారు. విద్యార్థులు ఎవరూ బేస్‌మెంట్ వద్దకు వెళ్లొద్దని సూచించారు. తోటి విద్యార్థులు చనిపోవడం అనేది బాధను కలిగిస్తుంది.. కానీ ఘటనా స్థలికి రావడం వల్ల పరిష్కారం దొరకదని డీసీపీ పేర్కొన్నారు.
Also Read :Breast Cancer: మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో.. లేదో? నిమిషంలో తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..?
బేస్‌మెంట్‌లో మరింత మంది చిక్కుకొని ఉండొచ్చనే అనుమానాన్ని ఢిల్లీ ఫైర్ విభాగం చీఫ్ అతుల్ గార్గ్ వ్యక్తం చేశారు. అందుకే ఎన్డీఆర్ ఎఫ్, ఢిల్లీ అగ్నిమాపక విభాగాలు కలిసి రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. బేస్‌మెంట్‌లోకి అకస్మాత్తుగా వరదనీరు పోటెత్తడంతో.. అందులోని 30 మంది వేగంగా బయటికి వచ్చారని, ముగ్గురే మిగిలారని అంటున్నారు. రెండు రోజుల క్రితమే సివిల్స్ అభ్యర్ధి ఒకరు ఇదే ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో చనిపోవడం గమనార్హం. దీనిపై విచారణ నివేదిక సమర్పించాలని అధికారులను ఇప్పటికే ఢిల్లీ మంత్రి అతిషి ఆదేశించారు. శనివారం అర్ధరాత్రి వరకు ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్, స్థానిక ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటన వెనుక ఎవరైనా ఉన్నట్లు తేలితే వదిలేది లేదని వారు స్పష్టం చేశారు.