3 Killed : బెంగాల్‌లో తొక్కిస‌లాట‌.. ప్ర‌తిప‌క్ష‌నేత సువేందు అధికారి కార్య‌క్ర‌మంలో ఘ‌ట‌న.. ముగ్గురు మృతి

బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో సువేందు అధికారికి దుప్పటి పంపిణీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయారు. 

  • Written By:
  • Publish Date - December 15, 2022 / 06:40 AM IST

బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో సువేందు అధికారికి దుప్పటి పంపిణీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయారు.  పశ్చిమ బుర్ద్వాన్ జిల్లాలో బుధవారం సాయంత్రం ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి భారీగా జ‌నం హాజ‌రైయ్యారు. రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించగా.. ఐదుగురు గాయ‌ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. సువేందు అధికారి ప్రసంగం ముగించుకుని వేదిక నుంచి వెళ్లిన కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమాన్ని అసన్సోల్ మాజీ మేయర్, బీజేపీ నేత జితేంద్ర తివారీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సువేందు అధికారి హాజరయ్యారు. క్షతగాత్రులను అసన్సోల్ జిల్లా ఆసుపత్రికి తరలించి, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అసన్సోల్ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కార్యక్రమానికి బిజెపి అనుమతి తీసుకోలేదు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు సువెందు అధికారిని అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. ఇది చాలా దురదృష్టకర ఘటన అని.. కార్యక్రమానికి సువేందు అధికారి అనుమతి తీసుకోలేదని ఆయ‌న ఆరోపించారు. దుప్పట్ల పంపిణీ పేరుతో అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలను ఒక ప్రాంతానికి పిలిచారని తెలిపారు