Godown Collapses: గోడౌన్ కూలి ఓ బాలిక సహా ముగ్గురు మృతి.. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం

మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండిలో శనివారం రెండంతస్తుల గోడౌన్ కూలిన (Godown Collapses) ఘటనలో ఓ బాలిక సహా ముగ్గురు మృతి చెందగా (3 Killed), 12 మందిని రక్షించారు.

  • Written By:
  • Publish Date - April 30, 2023 / 09:10 AM IST

మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండిలో శనివారం రెండంతస్తుల గోడౌన్ కూలిన (Godown Collapses) ఘటనలో ఓ బాలిక సహా ముగ్గురు మృతి చెందగా (3 Dead), 12 మందిని రక్షించారు. శిథిలాల మధ్య ఇంకా 10 మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఈ మేరకు నగరపాలక సంస్థ అధికారి తెలిపారు. మాన్‌కోలిలోని వల్పాడలోని వర్ధమాన్ కాంపౌండ్‌లోని రెండంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కూలిపోయిందని థానే మున్సిపల్ కార్పొరేషన్ (TMC) ప్రాంతీయ విపత్తు నిర్వహణ విభాగం అధిపతి అవినాష్ సావంత్ తెలిపారు.

భవనం పై అంతస్తులో నాలుగు కుటుంబాలు నివసిస్తుండగా కింది అంతస్తులో కూలీలు పనిచేస్తున్నారని సావంత్ చెప్పారు. గత ఎనిమిది గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, సాయంత్రానికి డాగ్ స్క్వాడ్, ఇద్దరు ఎర్త్ మూవర్లను రంగంలోకి దించామని తెలిపారు. “నాలుగున్నరేళ్ల బాలిక, 40 ఏళ్ల వ్యక్తి, 26 ఏళ్ల మహిళ మృతదేహాలను శిథిలాల నుండి వెలికి తీయగా, 12 మందిని రక్షించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు” అని సావంత్ తెలిపారు. శిథిలాల కింద ఇంకా 10 మంది చిక్కుకుపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

Also Read: Chennai: చెన్నైలో షాకింగ్ ఘటన.. విమానాశ్రయంలో వివాహిత ఆత్మహత్య

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల పరిహారం, క్షతగాత్రుల చికిత్స ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. షిండే కూడా రాత్రి ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న అన్ని ఏజెన్సీల మధ్య సరైన సమన్వయం ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి.. అధికారులను ఆదేశించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, అగ్నిమాపక సిబ్బందితో సహా వివిధ ఏజెన్సీల సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. సీనియర్ అధికారులు, స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.