పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మృతి చెందిన వారిని ప్రశాంత్ సాహా (50), బపన్ ఘోష్ (35), రీటా సాహా (35)గా గుర్తించగా.. గాయపడినవారు ముక్తి సాహా, గోపాల్ కర్, మృదుల్ సాహాగా గుర్తించారు. గాయపడిన వారు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి ముక్తి సాహాకు గుండెపోటు వచ్చిందని, ఆ తర్వాత ఆమెను స్థానిక మేనాగురి ఆసుపత్రికి తరలించారని పోలీసు వర్గాలు తెలిపాయి.
Also Read: Over 3,800 Killed: టర్కీలో భారీ భూకంపం.. 3800లకు చేరిన మృతుల సంఖ్య
అయితే, ఆమె పరిస్థితి విషమంగా మారడంతో సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆమెతో పాటు బంధువులు, సహోద్యోగులతో అంబులెన్స్ సోమవారం తెల్లవారుజామున ఉత్తర బెంగాల్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి బయలుదేరింది. ఫుల్బరీ ప్రాంతంలో అంబులెన్స్ ఎదురుగా వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. లారీ డ్రైవర్, సహాయకుడు పరారీలో ఉన్నారు. పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.