Mumbai Attacks : 26/11 ప్రధాన సూత్రధారి సాజిద్​ మీర్ కు పాక్ లో 15 ఏళ్ల జైలు!

26/11 ముంబై ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి సాజిద్ మీర్‌కు పాకిస్థాన్ లోని యాంటీ టెర్రరిజం కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

  • Written By:
  • Publish Date - June 25, 2022 / 11:24 AM IST

26/11 ముంబై ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి సాజిద్ మీర్‌కు పాకిస్థాన్ లోని యాంటీ టెర్రరిజం కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.ముంబై ఉగ్రదాడికి నిధులు సమకూర్చాడనే అభియోగాలను సాజిద్ మీర్‌ ఎదుర్కొన్నాడు. అతను కొన్నాళ్ల క్రితమే చనిపోయినట్టు ఇన్ని రోజులు బొంకుతూ వచ్చిన పాకిస్థాన్​.. ఈ ఏడాది ఏప్రిల్ లోనే అతడి అరెస్టును ప్రకటించింది. తాజాగా శనివారం కోర్టు ద్వారా సాజిద్ మీర్‌ కు శిక్షను ఖరారు చేయడం గమనార్హం.

FBI మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు..

ముంబై ఉగ్ర దాడుల్లో మొత్తం 166 మంది చనిపోయారు. ఈ దాడికి సూత్రధారి, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన అగ్రశ్రేణి లీడర్ అయిన​ మీర్ తలపై 5 మిలియన్ డాలర్ల రివార్డు ఉంది. ఇంకా అతను FBI మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలోనే ఉన్నాడు. ఉగ్ర వాదులు ముంబైకు వచ్చిన తర్వాత.. మీర్ ద్వారానే పాకిస్థాన్​ నుంచి కీలక ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గతంలో తమ దేశంలో మీర్​ అనే వ్యక్తి ఎవరూ లేరని పాకిస్థాన్​ చెబుతూ వచ్చింది. అతను తమ దేశానికి చెందినవాడే కాదని దాడుల ఘటనను తమపై రుద్దేందుకు ఇలా చేస్తున్నారని కొట్టిపారేసింది. ఆ తర్వాత కొంతకాలానికి మీర్​ చనిపోయాడని పాకిస్థాన్​ పేర్కొంది. జీ7 దేశాల మనీ లాండరింగ్ వ్యతిరేక సంస్థ ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ ఫోర్స్​ (FATF) నుంచి ఒత్తిడి తీవ్రం అయినప్పుడు కూడా ఇదే విషయాన్ని పాక్ చెబుతూ వచ్చింది.