Operation Sindhu: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) ద్వారా భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలిస్తోంది. గత ఆరు రోజుల్లో ఇరాన్ నుంచి 10 విమానాల్లో మొత్తం 2294 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున వచ్చిన విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 16 మంది, వీరిలో తీర్థయాత్రలకు వెళ్లినవారు, కెర్మన్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఉన్నారు.
కెర్మన్ మెడికల్ యూనివర్సిటీలో రెండో సంవత్సరం మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు, టెహ్రాన్‌కు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యూనివర్సిటీ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. సంఘర్షణ తగ్గిన తర్వాత తిరిగి చదువు కొనసాగించేందుకు ఇరాన్‌కు వెళ్తామని వారు చెప్పారు. విద్యార్థులను మొదట కెర్మన్ నుంచి బస్సుల ద్వారా మషాద్‌కు తరలించి, అక్కడి నుంచి విమానాల్లో భారత్‌కు పంపించారు. ఈ ఉదయం రెండు భారత వాయుసేన విమానాలు ఇరాన్ నుంచి ఢిల్లీకి మరికొందరు భారతీయులను తీసుకొస్తున్నాయి. ఇజ్రాయెల్ నుంచి కూడా భారతీయులను జోర్డాన్, ఈజిప్ట్ వంటి సరిహద్దు మార్గాల ద్వారా తరలిస్తున్నారు. గత రోజు 160 మంది భారతీయులు జోర్డాన్ సరిహద్దు ద్వారా సురక్షితంగా బయటకు వచ్చారు.
Also Read: TPCC Meetings: నేడు గాంధీ భవన్‌లో టీపీసీసీ కీలక సమావేశాలు!
విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక పోస్ట్‌లో “ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. 23 జూన్ 2025న మషాద్ నుంచి 290 మంది భారతీయులు, ఒక శ్రీలంక పౌరుడు ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటివరకు 2003 మంది భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చాం” అని తెలిపారు. నేపాల్, శ్రీలంక పౌరులను కూడా భారత్ తరలిస్తోంది. వారి ప్రభుత్వాల అభ్యర్థన మేరకు ఈ చర్యలు చేపట్టారు.
స్వదేశానికి చేరుకున్న భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు తమను సురక్షితంగా తరలించిన భారత ప్రభుత్వం, విదేశాంగ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక విద్యార్థి మాట్లాడుతూ.. “మేం భయపడ్డాం, కానీ భారత రాయబార కార్యాలయం త్వరగా స్పందించి మమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చింది” అని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తూ భారతీయుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ ఆపరేషన్ గతంలో ఉక్రెయిన్, ఆఫ్ఘనిస్థాన్, సూడాన్‌ల నుంచి భారతీయులను తరలించిన ఆపరేషన్ గంగా, దేవీ శక్తి, కావేరి, అజయ్ వంటి మిషన్ల స్ఫూర్తితో కొనసాగుతోంది. భారత్‌లోని 24/7 కంట్రోల్ రూమ్, టెల్ అవీవ్, టెహ్రాన్‌లోని రాయబార కార్యాలయాలు నిరంతరం పౌరులతో సంప్రదింపులు జరుపుతూ, సహాయం అందిస్తున్నాయి.