Haryana Elections: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 3 రోజులే మిగిలి ఉంది. కట్టుదిట్టమైన భద్రతతో అక్టోబర్ 5న ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల కోసం 225 పారామిలటరీ, 60,000 మంది భద్రతా సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలకు ముందు 11,000 మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు కూడా పని చేయనున్నారు. రాష్ట్రంలోని గురుగ్రామ్, ఫరీదాబాద్, అంబాలాలో అత్యధికంగా డబ్బు రికవరీ అయినట్లు హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్ తెలిపారు.
హర్యానాలో 90 మంది సభ్యులున్న శాసనసభకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక్కడ ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు పంపిణి జరుగుతుంది. హర్యానా వ్యాప్తంగా 60 కోట్ల రూపాయలకు పైగా రికవరీ చేశారు. నుహ్ ప్రాంతం అత్యంత సున్నితమైన ప్రాంతంగా గుర్తించబడింది. నుహ్‌లో 13 పారామిలిటరీ కంపెనీలను మోహరించారు అని హర్యానా డిజిపి శత్రుజీత్ కపూర్ తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో హర్యానా పోలీసులు 27,000 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీని కూడా వెలికితీశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని రాజకీయ నేతలు విజ్ఞప్తి చేశారు. హర్యానా ప్రధాన ఎన్నికల అధికారి పంకజ్ అగర్వాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్‌ను పర్యవేక్షించడానికి రాష్ట్ర, జిల్లా మరియు అసెంబ్లీ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
పోలింగ్ రోజున అధీకృత కార్యకలాపాల్లో పాల్గొనేందుకు మాత్రమే పోలింగ్ ఏజెంట్లకు అనుమతి ఉంటుందని అగర్వాల్ హెచ్చరించారు. నిషేధిత కార్యకలాపాలలో ఏదైనా ప్రమేయం ఉంటే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇందుకోసం మార్గదర్శకాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు, నగదు, ఆయుధాల రవాణాను నిరోధించేందుకు చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని అగర్వాల్ నొక్కి చెప్పారు. జిల్లా పర్యవేక్షణ బృందాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read: Shami Injury Update: ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన షమీ, ఎందుకో తెలుసా?