దేశవ్యాప్తంగా తొక్కిసలాట ఘటనలు (Stampede Incidents) ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రజా కార్యక్రమాలు, పండుగలు, మత యాత్రలు, రాజకీయ సభలు వంటి సందర్భాల్లో ప్రజల అధిక సంఖ్యలో తరలివచ్చి నియంత్రణ తప్పడం వల్ల ప్రాణ నష్టం చోటుచేసుకుంటోంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు దేశంలో జరిగిన తొక్కిసలాట ఘటనల్లో కనీసం 114 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది మృతి చెందడంతో ఈ సమస్య మరలా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఘటన ప్రజా భద్రత, జన నియంత్రణ వ్యవస్థల్లో ఉన్న లోపాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది.
Fenugreek Water: ప్రతీ రోజు మెంతుల నీరు తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
ఇటీవలి సంవత్సరాల్లో ఇది రెండో అత్యధిక ప్రాణనష్టం నమోదైన సంవత్సరం కావడం గమనార్హం. 2024లో తొక్కిసలాటల వల్ల 123 మంది మరణించారు, అందులో ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన నారాయణ్ సకార్ హరి సత్సంగ్ విషాదంలోనే 116 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత సంవత్సరం (2025)లో కాశీబుగ్గ ఘటనతో కలిపి ఆరు ప్రధాన తొక్కిసలాటలు చోటుచేసుకున్నాయి. జనవరి 29న మహాకుంభ్‌లో 30 మంది, ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో 18 మంది, ఉత్తర గోవా షిర్గావ్ జాతరలో 7 మంది, జూన్ 4న బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ సంబరాల్లో 11 మంది, అలాగే తమిళనాడులో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ర్యాలీలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలు దేశంలో తొక్కిసలాట ఘటనల తీవ్రతను స్పష్టంగా చూపుతున్నాయి.
నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ ఘటనలు జరగడానికి ప్రధాన కారణం జన నియంత్రణలో లోపం, అధికారుల నిర్లక్ష్యం, తగిన ఎమర్జెన్సీ వ్యవస్థలు లేకపోవడం అని చెబుతున్నారు. అనేక సందర్భాల్లో అధికారులు ప్రజల సంఖ్యను తక్కువగా అంచనా వేయడం వల్ల ఏర్పాట్లు తగిన విధంగా ఉండవు. ఫలితంగా గందరగోళం, తోపులాట, తొక్కిసలాటలు తప్పవు. భద్రతా సిబ్బంది తగిన శిక్షణ లేకపోవడం, ప్రవేశం-నిష్క్రమణ మార్గాలు సరిగా ఉండకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ తరహా విషాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ప్రజా సమూహ నిర్వహణపై ప్రత్యేక నిబంధనలు, అత్యవసర ప్రతిస్పందన బృందాల ఏర్పాటు, సాంకేతిక పర్యవేక్షణ వ్యవస్థలు అమలు చేయడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
