2000 Notes Ban Proposal: రూ.2 వేల నోట్లను రద్దు చేస్తారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. ఈ నోట్ల ప్రింటింగ్‌ను రిజర్వ్ బ్యాంకు నిలిపివేయడం, ఏటీఎంలలో అసలు కనిపించకపోవడం, బ్యాంకుల్లో కూడా ఇవ్వకపోతుండటంతో.. రూ.2 వేల నోట్లను రద్దు చేయబోతున్నారనే ప్రచారం గత రెండేళ్లుగా జరుగుతూనే ఉంది. ఆర్‌బీఐ మాత్రం ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ రూ.2 వేల నోట్ల ప్రింటింగ్‌ను మాత్రం నిలిపివేసినట్లు ఆర్‌బీఐ చెబుతోంది.
ఆర్‌బీఐ ప్రింటింగ్ నిలిపివేయడం, ఏటీఎంలలో ఎక్కడా కనిపించకపోవడం, బటయ కూడా చలామణిలో పెద్దగా లేకపోవడంతో.. ఏ క్షణంలోనైనా రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.2 వేల నోట్లను రద్దు చేయాలని, బ్యాంకుల్లో మార్చుకునేందుకు రెండు సంవత్సరాలు గడువు ఇవ్వాలని రాజ్యసభలో కోరారు. దశలవారీగా రూ.2 వేల నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన చేసిన ప్రతిపాదన సంచలనంగా మారింది.
సుశీల్ కుమార్ మోడీ వ్యాఖ్యలతో మరోసారి రూ.2 వేల నోట్ల రద్దు వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. రూ.2 వేల నోట్లు ఏటీఎంలలో కనిపించడం లేదని, అవి త్వరలో చట్టబద్దం కాకపోవచ్చనే వదంతులు బయట వినిపిస్తున్నాయని సుశీల్ కుమార్ మోదీ రాజ్యసభలో జీరో అవర్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. రూ.2వేల నోట్ల రద్దుపై స్ఫష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రూ.2 వేల నోట్లు నల్లధనానికి పర్యాయపదంగా మారిందని, డ్రగ్స్, మనీలాండరింగ్ వంటి అక్రమ వ్యాపారాల్లో ఉపయోగించుకోవడానికి, నిల్వ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని తెలిపారు.
రూ.వెయ్యి నోట్లను రద్దు చేసి రూ.2వేల నోట్లను తీసుకురావడంలో అసలు అర్ధం లేదని సుశీల్ కుమార్ మోదీ విమర్శించారు. కాగా 2016లో ప్రధాని మోదీ పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. రూ.500, రూ.వెయ్యి నోట్ల స్థానంలో కొత్త రూ.500, రూ.2 వేల నోట్లను అందుబాటులోకి తెచ్చారు. నల్లధనాన్ని అరికట్టడానికే పెద్ద నోట్లను రద్దు చేస్తామని మోదీ చెప్పినా.. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు.
