Site icon HashtagU Telugu

Explosion: యుద్ధ‌ట్యాంక్ పేలి ఇద్ద‌రు సైనికులు మృతి..!

Explosion

Explosion

ప్ర‌మాద‌వ‌శాత్తు యుద్ధ‌ట్యాంక్ బ్యారెల్ పేలిన సంఘటనలో సుమీర్ సింగ్, సుకాంత్ మొండ‌ల్ అనే ఇద్ద‌రు భార‌త సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఉత్త‌ర‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో చోటుచేసుకుంది. ఫీల్డ్ ఫైరింగ్ ఎక్స‌ర్‌సైజ్ నిర్వ‌హిస్తున్న క్ర‌మంలో టీ-90 ట్యాంక్ బ్యారెల్ పేల‌డంతో ఈ విషాదం చోటుచేసుకున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. గాయప‌డిన మ‌రో అధికారి చికిత్స పొందుతున్న‌ట్లు అధికారులు తెలిపారు. దీనిపై విచారణకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించినట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు.

“ఝాన్సీ సమీపంలోని బాబినా కంటోన్మెంట్‌లో ఫీల్డ్ ఫైరింగ్ ఎక్సర్‌సైజ్‌లో T-90 ట్యాంక్ బ్యారెల్ పేల‌డంతో ఇద్దరు భారతీయ ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై విచారణకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది” అని ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు. పేలుడు జరిగిన తరువాత సైనికుల‌ను మిలిటరీ హాస్పిటల్ కు తరలించి తక్షణ వైద్య సహాయం అందించిన‌ట్లు వారు పేర్కొన్నారు. అయితే చికిత్స పొందుతున్న సైనికులు ఇద్ద‌రు కాలిన గాయాలతో మరణించార‌ని తెలిపారు.

ఈ సంఘటనపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు భారత సైన్యం ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ ప్ర‌మాదంపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.