Site icon HashtagU Telugu

Selfie Cop : సెల్ఫీ వీడియో దుమారం.. ఇద్దరి మృతి, 25 మందికి గాయాలు

Selfie Cop

Selfie Cop

Selfie Cop : ఒక హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ  పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంతో ఉద్రిక్తత ఏర్పడింది. వందలాది మంది కుకీ-జో తెగ ప్రజలు మణిపూర్‌లోని చురచంద్‌పూర్ జిల్లా కేంద్రంలో నిరసనకు దిగారు. జిల్లా పోలీసు చీఫ్ కార్యాలయం వెలుపల పార్క్ చేసి ఉంచిన బస్సుతో పాటు అక్కడున్న పలు నిర్మాణాలకు నిప్పు పెట్టారు. ఆగ్రహించిన అల్లరి మూకలు హింసాత్మకంగా చెలరేగడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్దనున్న భద్రతా బలగాలు వారిపైకి కాల్పులు జరిపాయి. ఈ ఘటనల్లో ఇద్దరు చనిపోగా, 25 మంది గాయపడ్డారు. దీంతో చురచంద్‌పూర్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత(Selfie Cop) ఏర్పడింది.

ఈ ఘటనకు కారణమేంటి ?

సియామ్‌లాల్‌పాల్‌.. ఒక హెడ్ కానిస్టేబుల్‌. ఆయన ఫిబ్రవరి 14న కుకీ తెగకు చెందిన ఒక మిలిటెంట్ గ్రూపు సభ్యులతో కలిసి సెల్ఫీ వీడియో దిగాడు. ఏదో ఒక విధంగా బయటికొచ్చిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో విషయం  చురచంద్‌పూర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దాకా చేరింది. ఈ కారణంగా సియామ్‌లాల్‌పాల్‌‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ శివానంద్ సర్వే ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో హెడ్ కానిస్టేబుల్‌ సియామ్‌లాల్‌పాల్‌‌ను తిరిగి జాబ్‌లో నియమించాలనే డిమాండ్‌తో గురువారం రాత్రి కుకీ తెగకు చెందిన దాదాపు 400 మందికిపైగా నిరసనకారులు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.  తమ తెగకు చెందిన హెడ్ కానిస్టేబుల్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ కుకీ నిరసనకారులు నినాదాలు చేశారు. పోలీసు అధికారుల నుంచి సమాధానం రాకపోవడంతో కొంతమంది నిరసనకారులు స్టేషన్ ఎదుటనున్న వాహనాలకు నిప్పుపెట్టడం మొదలుపెట్టారు. కొందరు కార్యాలయంపైకి రాళ్లు రువ్వారు. ఈక్రమంలోనే తొలుత నిరసనకారులపైకి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. అయినా వాళ్లు వెనక్కి తగ్గకపోవడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటన నేపథ్యంలో  జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. 2023 మే నుంచి దాదాపు 6 నెలల పాటు మణిపూర్‌‌లో కొనసాగిన హింసాకాండలో ఎక్కువగా ప్రభావితమైన జిల్లా చురచంద్‌పూర్.

We’re now on WhatsApp. Click to Join

నన్ను చంపేస్తారట.. 

సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (కాంబాట్) కల్నల్ నెక్టార్ సంజెన్‌బామ్ (రిటైర్డ్)‌పై తెంగ్నౌపాల్ యూనిట్ కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (కెఎస్‌ఓ) మాజీ చీఫ్ హెచ్ తంగ్టిన్లెన్ డేనియల్ మేట్ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడిన సదరు సీనియర్ పోలీసు అధికారిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ‘‘నాకు మిస్టర్ నెక్టార్ ఫోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. రాత్రి చాలా ఆలస్యం అయినందున నేను కాల్ రిసీవ్ చేసుకోలేదు. కొన్ని నిమిషాల తర్వాత నాకు ప్రాణహాని టెక్స్ట్ సందేశం వచ్చింది. అతను నన్ను చంపబోతున్నాడట’’ అని డేనియల్ మేట్  గురువారం తెంగ్నౌపాల్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారికి రాసిన ఫిర్యాదు లేఖలో వివరించారు.