ISRO Success : ఇస్రోకు మరో సక్సెస్.. హిందూ మహాసముద్రంలో ఉపగ్రహం కూల్చివేత

ISRO Success : ఇస్రో మరో ఘనత సాధించింది.

  • Written By:
  • Publish Date - February 17, 2024 / 03:59 PM IST

ISRO Success : ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలోని వివిధ కక్ష్యల్లో పెరిగిపోతున్న పాత ఉపగ్రహాలను తొలగించే ప్రక్రియలో కీలక ముందడుగు వేసింది. దాదాపు 17 ఏళ్ల క్రితం ప్రయోగించిన కార్టోశాట్-2 శాటిలైట్‌ను భూ వాతావరణంలోకి తీసుకువచ్చి.. అక్కడి నుంచి హిందూ మహా సముద్రంలో పడేలా చేసింది. ఈ నెల 14న మధ్యాహ్నం 3.48 గంటలకు కార్టోశాట్‌-2 ఉపగ్రహాన్ని హిందూ మహాసముద్రంలో కూల్చివేసే ప్రక్రియ విజయవంతంగా జరిగిందని ఇస్రో వెల్లడించింది. దీనివల్ల అంతరిక్షంలో కొంతైనా చెత్త తగ్గుతుందని ఈ సందర్భంగా ఇస్రో తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join

అత్యంత స్పష్టమైన అధిక రెజల్యూషన్‌ కలిగిన ఫోటోలను తీసేందుకు 2007 జనవరి 10న కార్టోశాట్-2 ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. 680 కిలోల బరువున్న కార్టోశాట్‌–2 శాటిలైట్‌ను 635 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. అయితే ఈ ఉపగ్రహం 2019 వరకు సక్సెస్‌ఫుల్‌గా పనిచేసింది. ఆ తర్వాత తన కక్ష్యను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అనంతరం వేగంగా పరిభ్రమిస్తూ మండుతూ ధ్వంసమై చిన్న చిన్న ముక్కలుగా మారిపోవడం మొదలుపెట్టింది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సాధారణంగా 30 ఏళ్ల టైం పడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఆ కక్ష్యల్లో మరిన్ని ఉపగ్రహాలు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అక్కడ ఉన్న అంతరిక్ష చెత్తను తగ్గించేందుకు ముందుగానే కార్టోశాట్-2 ఉపగ్రహాన్ని భూ వాతావరణంలోకి రప్పించి ఇస్రో కూల్చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష మార్గదర్శకాల ప్రకారం ఈ కార్టోశాట్-2 ను సముద్రంలో పడేసినట్లు ఇస్రో(ISRO Success) తెలిపింది.

Also Read : Delete Truecaller : ట్రూకాలర్​ అకౌంట్ తీసేయడం.. ఫోన్​ నంబర్​ తొలగించడం ఇలా..

అంతరిక్షంలోకి పంపించిన కొన్ని శాటిలైట్లు తిరిగి భూమిని చేరుతాయి. కానీ చాలా శాటిలైట్లు మాత్రం అక్కడే తిరుగుతూ ఉంటాయి. వాటి జీవిత కాలం అయిపోయినా.. వాటిని మళ్లీ భూమిపైకి తీసుకురాకపోవడంతో అవి అంతరిక్షంలో పనికిరాని చెత్త కింద పోగవుతూ ఉంటాయి. దీంతో అంతరిక్షంలోకి ప్రపంచ దేశాలు పంపించిన ఎన్నో ఉపగ్రహాలు.. వాటి పని పూర్తయినా అక్కడే ఉండటంతో అక్కడ చెత్త భారీగా పేరుకుపోతోంది.

Also Read : Russia – Palestine : ‘పాలస్తీనా’ మిలిటెంట్ గ్రూపులకు పుతిన్ పిలుపు.. ఎందుకు ?