Site icon HashtagU Telugu

Jharkhand : జార్ఖండ్ లో బీజేపీకి ఝలక్.. 16 మంది ఎమ్మెల్యేలు జంప్!?

Bjp Hemant Soren

Bjp Hemant Soren

కర్ణాటక, మధ్యప్రదేశ్, మహా రాష్ట్రలలో ఇతర పార్టీల ప్రభుత్వాలు కూలిపోయి.. బీజేపీ గద్దెను ఎక్కడాన్ని దేశమంతా చూసింది. ఇదంతా బీజేపీ ముందు చూపు, రాజకీయ వ్యూహాల వల్లే సాధ్యమైంది. వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఇతర పార్టీలలోని అనైక్యతను వాడుకొని బీజేపీ ఫిరాయింపులు చేయించగలుగుతోంది. రెబల్ వర్గాలను సృష్టించి.. తమకు మద్దతు ఇచ్చేలా వాటిని సిద్ధం చేసుకోవడంలో కమల దళం సఫలం అవుతోంది. ఇప్పుడు బీజేపీ చూపు జార్ఖండ్‌ వైపు ఉందని మీడియాలో టాక్ వచ్చింది. కానీ అందుకు భిన్నమైన పరిణామం అక్కడ జరుగుతోంది.బీజేపీ నుంచి పదహారు మంది ఎమ్మెల్యేలు తమతో ‘టచ్‌’లో ఉన్నారని జార్ఖండ్‌ ముక్తి మోర్చా అనూహ్య ప్రకటన చేసింది. ‘బీజేపీ ఆకర్ష్‌.. ఇక్కడ వర్కవుట్‌ అయ్యే ఛాన్స్‌ లేదు. ఎందుకంటే 16 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో ఇబ్బందికర పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. వాళ్లంతా హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు’ అని జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారిక ప్రతినిధి సుప్రియో భట్టాచార్య ప్రకటించారు. అవసరం అయితే బీజేపీ నుంచి చీలిపోయి.. ఒక గ్రూపుగా ఏర్పడి జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు వాళ్లంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

బలాబలాలు..

ప్రస్తుతం జేఎంఎం ప్రభుత్వ పాలన స్థిరంగానే కొనసాగిస్తోంది. 2019 ఎన్నికల్లో మొత్తం 81 స్థానాలు ఉన్న జార్ఖండ్‌ అసెంబ్లీలో జేఎంఎం 30, కాంగ్రెస్‌ 16, ఆర్జేడీ 1 స్థానం గెల్చుకుంది. అలాగే బీజేపీ 25 స్థానాలు దక్కించుకుంది. యూపీఏ కూటమితోనే జేఎంఎం ప్రభుత్వం నడుస్తోంది అక్కడ. అయితే.. ఆ రాష్ట్ర సీఎం హేమంత్‌ సోరెన్‌పై అక్రమ మైనింగ్‌ ఆరోపణలపై దర్యాప్తు సంస్థల దృష్టి పడింది. మరోవైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సైతం బీజేపీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో జేఎంఎం.. బీజేపీ నుంచే తమవైపు ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రకటించడం కొసమెరుపు.
ఇదిలా ఉంటే జేఎంఎం ప్రకటనపై బీజేపీ వెటకారంగా స్పందించింది. అవినీతిలో కూరుకుపోయిన జేఎంఎం.. ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని పేర్కొంది. త్వరలో జేఎంఎంతో పాటు కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి వలసలు తప్పవని బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్‌ సహదేవ్‌ పేర్కొన్నారు.

Exit mobile version