Site icon HashtagU Telugu

Naga Sadhus : తమకు తామే పిండం పెట్టుకొని నాగ సాధువులైన 1,500 మంది

Naga Sadhus Pind Daan Mahakumbh 2025 Min

Naga Sadhus : భారీ భక్తజన సందోహం నడుమ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. ఇందులో నాగ సాధువులు ప్రత్యేకంగా నిలుస్తున్నారు. కొత్తగా ఎంతోమంది సాధువులు.. నాగ సాధువులుగా మారిపోతున్నారు. జునా అఖాడాలో ఇప్పటికే ఎంతోమంది నాగసాధువులు ఉన్నారు. మహాకుంభ మేళా సాక్షిగా దాదాపు 1500 మంది  సాధారణ సాధువులు.. నాగా సాధువులుగా మారారు. వారంతా జునా అఖాడాలో చేరిపోయారు. ఈ అఖాడా హరిద్వార్, వారణాసి నగరాల్లోని ఆశ్రమాలను కేంద్రంగా చేసుకొని పనిచేస్తోంది. నాగ సాధువులుగా మారే ముందు ఈ 1500 మంది వారి తల్లిదండ్రులకు, ఏడు తరాల వారికి పిండప్రదానం చేశారు. తద్వారా తమకు ఇక కుటుంబంతో ఎలాంటి సంబంధమూ ఉండదని పరోక్షంగా ప్రకటించారు. ఈ నాగ సాధువులు తమ జీవితాంతం సనాతన ధర్మ పరిరక్షణకు, వేద సంప్రదాయ పరిరక్షణకు కట్టుబడి ఉంటారు. నాగ సాధువులు కావడం అంత ఈజీ కాదు..  అందుకోసం చాలా నిష్టగా ఉండాలి.

నాగ సాధువుగా మారడం ఎలా ?

  • నాగ సాధువు(Naga Sadhus)గా మారడానికి సాధువులు అనేక రకాల పరీక్షలను ఎదుర్కోవాలి.
  • ఈ ప్రక్రియకు ఆరు నెలల నుంచి దాదాపు ఒక ఏడాది వరకు సమయం పడుతుంది.
  • ఈ  కఠిన పరీక్షల్లో  విజయం సాధించాలంటే..  సాధకుడు ఐదుగురు గురువుల నుంచి దీక్షను పొందాలి. ఈ దీక్ష ఇచ్చేవారిని పంచ దేవ్ అని అంటారు.
  • నాగ సాధువుగా మారాలంటే.. ఆ వ్యక్తి ప్రాపంచిక జీవితాన్ని పూర్తిగా త్యజించాలి.  తనకు తాను పిండప్రదానాన్ని చేసుకోవాలి.  భిక్షాటన  ద్వారా లభించే ఆహారాన్ని మాత్రమే తినాలి. ఏ రోజైనా ఆహారం లభించకపోతే, ఆకలితోనే ఉండాలి.
  • ఎవరు నాగసాధువు కావాలి అనేది చివరగా అఖారా కమిటీ నిర్ణయిస్తుంది.
  • నాగ సాధువుగా మారేందుకు ఆసక్తి కలిగిన వారి నుంచి అఖారా కమిటీకి దరఖాస్తులు అందుతాయి.
  • అనంతరం సదరు దరఖాస్తుదారులను 6 నెలల పాటు టెస్ట్ చేస్తారు. వారిపై క్రిమినల్ కేసులు కానీ, అనుచిత ప్రవర్తన రికార్డు కానీ లేదని నిర్ధారించుకున్న తర్వాతే తుది దశ పరీక్షలకు ఎంపిక చేస్తారు.
  • చివరగా ఆ దరఖాస్తుదారుల గురించి ఒక నివేదికను తయారు చేసి అఖారా ఆచార్యకు అందిస్తారు. ఆయన వాటిని పరిశీలించి,  అర్హులైన సాధువులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
  • అఖారాలో ఉన్నత స్థానాల్లో ఉన్న సాధువులు వారిని ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైతేనే నాగ సాధువుగా అవకాశం లభిస్తుంది.
  • ఎంపికయ్యే  అభ్యర్థులందరికీ అఖారా నియమాల గురించి చెబుతారు. అనంతరం వారితో ప్రమాణం చేయిస్తారు.
  • ఇవన్నీ పూర్తయిన తర్వాతే సాధువులను అమృత స్నానానికి పంపుతారు.