Site icon HashtagU Telugu

Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

Vande Mataram

Vande Mataram

Vande Mataram: భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ (Vande Mataram) రచన పూర్తయి నవంబర్ 7, 2025 నాటికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. బంకించంద్ర ఛటర్జీ 1875 నవంబర్ 7న రచించిన ఈ గీతం స్వాతంత్య్ర‌ పోరాటంలో అపారమైన స్ఫూర్తిని నింపి, జాతీయ ఐక్యతకు చిహ్నంగా నిలిచింది.

ప్రభుత్వ కీలక నిర్ణయాలు

ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని ప్రభుత్వం నాలుగు దశల్లో ఏడాది పొడవునా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. నవంబర్ 7, 2025న ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ స్థాయి ప్రారంభ కార్యక్రమం జరగనుంది. రేపు దేశవ్యాప్తంగా తెహసీల్ స్థాయి వరకు విస్తృత ప్రజా భాగస్వామ్యంతో వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా స్మారక స్టాంప్, నాణెంను విడుదల చేయనున్నారు. వందేమాతరం చరిత్రపై ప్రదర్శనలు, ఒక లఘు చిత్రం ప్రదర్శించబడుతుంది. ‘వందేమాతరం: సాల్యూట్ టు మదర్ ఎర్త్’ పేరుతో వృక్షారోపణ కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు.

Also Read: Bihar Election: బీహార్ ఎన్నికలు 2025.. ముగిసిన‌ తొలి దశ పోలింగ్, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు!

గీతం చరిత్ర

బంకించంద్ర చటర్జీ రచించిన ఈ పాట మొదట 1875లో ‘బంగాదర్శన్’ సాహిత్య పత్రికలో ప్రచురించబడింది. తరువాత దీనిని ‘ఆనందమఠ్’ నవలలో చేర్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ దీనికి సంగీతం అందించారు. ఈ గీతం 1905 నాటి స్వదేశీ ఉద్యమ సమయంలో నిరసన నినాదంగా మారి, జాతీయవాదానికి అపారమైన శక్తిని ఇచ్చింది.

1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ దీనిని జాతీయ పాటగా స్వీకరించింది. జాతీయ గీతం (జనగణమన)తో సమానమైన హోదాను కల్పించింది. ఈ వేడుకలు బంకించంద్ర చటర్జీ వారసత్వాన్ని గౌరవించడంతో పాటు, భవిష్యత్తు తరాలకు జాతీయ స్ఫూర్తిని అందించేందుకు దోహదపడతాయి.

జాతీయ హోదా

రాజ్యాంగ సభలో జనగణమన, వందేమాతరం రెండింటినీ జాతీయ చిహ్నాలుగా స్వీకరించడానికి ఏకాభిప్రాయం లభించింది. 1950 జనవరి 24న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటంలో దాని ముఖ్యమైన పాత్ర కారణంగా వందేమాతరం జాతీయ గీతంతో సమానమైన హోదాను కలిగి ఉండాలని, సమానంగా గౌరవించబడాలని పేర్కొన్నారు.

Exit mobile version