మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) చేసిన తాజా ప్రకటనతో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు (Telangana – Maharashtra Border) వివాదం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ముంబయిలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 12 వివాదాస్పద గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని ప్రకటించారు. ఇది తెలంగాణలో తీవ్ర స్పందనకు దారితీస్తోంది. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరి మండలంలో ఉన్న ఈ గ్రామాలను భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో చేర్చగా, 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం వాటిని చంద్రపూర్ జిల్లాలో జివితి తాలూకాలో కలిపింది. ఇదే ఈ వివాదానికి గర్భకారణమైంది.
Masala Foods : మసాలా ఫుడ్స్‌లో టమోట సాస్ ఎక్కువగా తింటున్నవారికి షాకింగ్ న్యూస్
ఈ గ్రామాల్లో గత మూడు దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వం తమ-తమ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. పరందోలి, ముకద్దంగూడ, కోట, ఇంద్రానగర్ లాంటి గ్రామాలకు ఇద్దరేసి సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఓటర్లు రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. రాష్ట్ర హక్కు కోసం కేకే నాయుడు కమిషన్ నివేదిక కూడా వచ్చి, ఈ గ్రామాలు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనివేనని తేల్చినా, మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది.
మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ గ్రామాలను మరోసారి తమ హక్కుగా ప్రకటించడంపై రాజకీయంగా కలకలం రేగుతోంది. శివసేన (ఉద్ధవ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ దీన్ని స్వాగతించగా, కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదాన్ని కూడా ప్రస్తావించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఎంపీ గోడం నాగేశ్ ఉన్నారు. ఇక మహారాష్ట్ర, కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉండటంతో, సీఎం ఫడణవీస్ వ్యాఖ్యల వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.