Maoists Encounter : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అడవులు వరుస ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్-ఒడిశా బార్డర్‌లో మరో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. గరియాబంద్ జిల్లా పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. జనవరి 19వ తేదీన రాత్రి నుంచే ఈ ఎన్‌కౌంటర్ జరుగుతోందని తెలిసింది. భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 14 మంది మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం. ఈవివరాలను పోలీసు అధికార వర్గాలు మీడియాకు తెలిపాయి.
Also Read :Trumps First Speech : ప్రవాస భారతీయులకు షాక్.. ట్రంప్ కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్
రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని అడవుల్లో..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లా, ఒడిశా రాష్ట్రంలోని నౌపాడ జిల్లాల మధ్య దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారని పోలీసులకు స్పష్టమైన సమాచారం అందింది. దీంతో ఆ అడవుల్లో పెద్దసంఖ్యలో భద్రతా బలగాలతో కూంబింగ్ ఆపరేషన్‌ను మొదలుపెట్టారు. ఈ ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ క్రమంలో వారికి తారసపడిన మావోయిస్టులు.. ఒక్కసారిగా భద్రతా బలగాలపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వారిని ఎదుర్కొనే క్రమంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భాగంగా సోమవారం రోజు ఇద్దరు మావోయిస్టులు చనిపోగా, ఒక సీఆర్పీఎఫ్ కమాండోకు గాయాలయ్యాయి. ఇవాళ మరో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య 14కు పెరిగింది.
Also Read :Earthquake : తైవాన్‌లో భూకంపం.. భయంతో రోడ్లపైకి జనం.. 27 మందికి గాయాలు
లొకేషన్ ఇదీ
ఒడిశా రాష్ట్రంలోని నౌపాడ జిల్లాకు 5 కిలోమీటర్ల దూరంలోని అడవుల్లో, ఫిరూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఎన్‌కౌంటర్(Maoists Encounter) జరిగింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీస్థాయిలో మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో దాదాపు వెయ్యి మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు సమాచారం. 2026 నాటికి దేశంలోని మావోయిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఈక్రమంలోనే కేంద్ర భద్రతా బలగాలను దింపి మరీ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ఏరివేత ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.