Site icon HashtagU Telugu

Cancer Cases: భారత్‌లో కలవరపెడుతున్న క్యాన్సర్ కేసులు.. కొత్త‌గా 14 ల‌క్ష‌ల కేసులు న‌మోదు..!

Cancer Risk

Cancer Risk

Cancer Cases: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా అంచనాల ప్రకారం.. 2022లో భారతదేశంలో 14.1 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు (Cancer Cases) నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా 9.1 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARAC) అంచనాల ప్రకారం.. పెదవులు, నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్ పురుషులలో సర్వసాధారణం అయ్యాయి. వరుసగా 15.6 శాతం, 8.5 శాతం కొత్త కేసులు ఉన్నాయి. అదే సమయంలో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ మహిళల్లో చాలా సాధారణం అయ్యాయి. కొత్త కేసుల్లో వాటి వాటా వరుసగా 27, 18 శాతంగా ఉన్నాయి.

IARC అనేది WHO క్యాన్సర్ ఏజెన్సీ

అలాగే క్యాన్స‌ర్‌ బారినపడి ఐదేళ్లపాటు బతికే వారి సంఖ్య భారతదేశంలో దాదాపు 32.6 లక్షలుగా తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఏజెన్సీ 20 మిలియన్ల కొత్త క్యాన్సర్ కేసులు, 9.7 మిలియన్ మరణాలను అంచనా వేసింది. రోగ నిర్ధారణ జరిగిన ఐదు సంవత్సరాల తర్వాత దాదాపు 53 మిలియన్ల మంది ప్రజలు సజీవంగా ఉంటారని అంచనా వేసింది.

ప్రతి ఐదుగురిలో ఒకరు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రతి తొమ్మిది మంది పురుషులలో ఒకరు, 12 మంది మహిళల్లో ఒకరు ఈ వ్యాధితో మరణిస్తున్నారని ఏజెన్సీ పేర్కొంది. భారతదేశంలో 75 ఏళ్లలోపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 10.6 శాతం అయితే, అదే వయస్సులో క్యాన్సర్‌తో మరణించే ప్రమాదం 7.2 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇవి వరుసగా 20 శాతం, 9.6 శాతంగా ఉన్నాయి.

WHO 115 దేశాల నుండి సర్వే ఫలితాలను ప్రచురించింది. చాలా దేశాలు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (UHC)లో భాగంగా క్యాన్సర్, పెయిన్ కేర్ సేవలకు తగినంతగా ఆర్థిక సహాయం చేయడం లేదని పేర్కొంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడింట రెండు వంతుల కొత్త కేసులు, మరణాలకు 10 రకాల క్యాన్సర్ కారణమని IARC అంచనాలు చూపిస్తున్నాయి. వారి డేటా 185 దేశాలు, 36 రకాల క్యాన్సర్లను కవర్ చేస్తుంది.

Also Read: Rakul Preet Singh Wedding: రకుల్‌ప్రీత్-జాకీ భగ్నానీల వివాహ వేదిక మార్పు.. ప్ర‌ధాని మోదీ కార‌ణ‌మా..?

ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత సాధారణ క్యాన్సర్ (అన్ని కొత్త కేసులలో 12.4 శాతం). ఈ క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణం. ఇది మొత్తం క్యాన్సర్ మరణాలలో 19 శాతం అని విశ్లేషణ కనుగొంది. ఆసియాలో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా ఊపిరితిత్తుల క్యాన్సర్ మళ్లీ ఆవిర్భవించడానికి పొగాకు వినియోగం ఒక కారణమని క్యాన్సర్ ఏజెన్సీ తెలిపింది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్ అని IARC కనుగొంది (అన్ని కొత్త కేసులలో 11.6 శాతం). ప్రపంచవ్యాప్తంగా ఏడు శాతం క్యాన్సర్ మరణాలకు కారణమైంది.

We’re now on WhatsApp : Click to Join

గర్భాశయ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదవ అత్యంత సాధారణంగా గుర్తించబడిన క్యాన్సర్. ఈ క్యాన్సర్ మరణాలకు తొమ్మిదవ ప్రధాన కారణమని డేటా చూపించింది. పొగాకు, ఆల్కహాల్, ఊబకాయం క్యాన్సర్ కేసుల పెరుగుదల వెనుక ప్రధాన కారకాలు అయితే, వాయు కాలుష్యం ఇప్పటికీ ప్రధాన పర్యావరణ కారకంగా ఉందని ఏజెన్సీ తెలిపింది.