Covid : దేశంలో హెచ్చుతగ్గులతో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది!

  • Written By:
  • Publish Date - November 11, 2021 / 04:10 PM IST

దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 11,89,470 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,091 కొత్త కేసులు వెలుగుచూశాయి. నిన్నటి కంటే 14శాతం మేర కేసులు పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 340 మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కేసులు 3.44 కోట్లకు చేరగా.. 4.6లక్షలకు పైగా మరణాలు నమోదయ్యాయని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు 1.4 లక్షల దిగువనే నమోదయ్యాయి. క్రియాశీల రేటు 0.40 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.25 శాతంగా కొనసాగుతోంది. నిన్న 13,878 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.38 కోట్లను దాటాయి. ఇక నిన్న 57.54 లక్షల మంది కరోనా టీకా తీసుకొన్నారు. దీంతో దేశంలో మొత్తం 110 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.

కాగా ఉత్తరప్రదేశ్ ను జికా వైరస్ వణికిస్తోంది. నిన్న కొత్తగా 16 కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు యూపీలో 106 కేసులు నమోదయ్యాయి. కొత్తగా వైరస్ బారిన పడిన వారిలో తొమ్మిది మంది పురుషులు, ఏడుగురు మహిళలు, ఇద్దరు గర్భిణులు ఉన్నారు. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నీపాల్ సింగ్ మాట్లాడుతూ… కొత్తగా వైరస్ బారిన పడిన 16 మంది కాన్పూర్ లోని హర్జీందర్ నగర్, పోఖార్ పూర్, తివారీపూర్ బగియా, క్వాజీ ఖేరా ప్రాంతాలకు చెందిన వారని చెప్పారు. వైరస్ బారిన పడిన గర్భిణులకు వైద్యులు అల్ట్రాసౌండ్ టెస్టులు నిర్వహించారని… ఇద్దరి గర్భాల్లోని పిండాలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు.