Site icon HashtagU Telugu

Maoists Encounter: మరో ఎన్‌కౌంటర్.. 31 మంది మావోయిస్టులు హతం.. ఇద్దరు జవాన్ల మృతి

Maoists Encounter In Chhattisgarh Maoists Killed

Maoists Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని అడవుల్లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. తాజాగా ఈరోజు తెల్లవారుజామున బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్  జరిగింది. డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌, కోబ్రా సిబ్బందితో కూడిన బృందాలు 31 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు కావడంతో, వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారికి ప్రస్తుతం అత్యవసర చికిత్స జరుగుతోంది.

Also Read :Driving License Test: డ్రైవింగ్‌ లైసెన్స్ టెస్ట్.. ఇక మరింత టఫ్.. ఎందుకో తెలుసా ?

అలా తారసపడటంతో..

పశ్చిమ బస్తర్‌‌ పరిధిలోని అడవుల్లో శుక్రవారం నుంచి మావోయిస్టుల(Maoists Encounter) కదలికలు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌, కోబ్రా సిబ్బందితో కూడిన టీమ్‌లు ఆ అడవుల్లోకి చేరుకున్నాయి. శుక్రవారం నుంచి భారీగా కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టాయి. ఈక్రమంలోనే బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతానికి చేరుకోగానే భద్రతా బలగాలకు మావోయిస్టుల టీమ్‌లు తారసపడ్డాయి. దీంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులే చనిపోయారని తొలుత భావించారు. అయితే కొన్ని గంటల్లోనే మరో అప్‌డేట్ వచ్చింది. 31 మంది మావోయిస్టులు హతమైనట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. గత నెలరోజులుగా బీజాపూర్ జిల్లా పరిధిలోని అడవులపైనే భద్రతా బలగాలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. తాజాగా గత వారం బీజాపుర్‌ జిల్లాలోని అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు.

Also Read :41 People Burned Alive: మంటల్లో బస్సు బుగ్గి.. 41 మంది సజీవ దహనం

భద్రతా బలగాల వాహనాన్ని పేల్చడంతో..

జనవరి 6న బీజాపూర్ జిల్లాలోని బెద్రె-కుత్రు రోడ్‌లో ఉన్న అడవుల్లో మావోయిస్టులు ఐఈడీతో భద్రతా బలగాల వాహనాన్ని పేల్చారు. ఈ ఘటనలో 8 మంది జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) జవాన్లు, ఒక డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు.  దీంతో మావోయిస్టులపై భద్రతా బలగాలు మరింత కసిగా ఏరివేత ఆపరేషన్‌ను చేస్తున్నాయి. డ్రోన్లు, ఇతరత్రా నిఘా వర్గాల నుంచి సమాచారాన్ని తెప్పించుకొని మరీ ఏరివేత చర్యలను చేపడుతున్నాయి. 2026 నాటికి దేశంలోని మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పదేపదే శపథాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో కార్యాచరణ జరుగుతోంది.