Jackal Attack : ఉత్తరప్రదేశ్‌లోని ఏజెన్సీ ఏరియాలు తోడేళ్లు, నక్కల వరుస దాడులతో చిగురుటాకులా వణికిపోతున్నాయి. తోడేళ్ల దాడిలో 8 మంది చనిపోవడంతో బహ్రయిచ్ జిల్లాను వన్యప్రాణుల నుంచి విపత్తును ఎదుర్కొంటున్న ప్రాంతంగా యూపీ సర్కారు ఇటీవలే ప్రకటించింది. ఈ తరుణంలో అదే రాష్ట్రంలోని పిలిభిత్ జిల్లా నుంచి కలవరపరిచే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ జిల్లాలోని జహనాబాద్ ప్రాంతంలో ఉన్న సుస్వార్, పన్సోలి గ్రామాల శివారు ప్రాంతాలపైకి నక్కల గుంపు విరుచుకుపడింది. వాటి దాడిలో ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సదరు చిన్నారులు ఇళ్ల బయట ఆడుకుంటుండగా నక్కలు దాడి చేశాయని పోలీసులు గుర్తించారు. ఈక్రమంలో నక్కల నుంచి చిన్నారులను రక్షించేందుకు యత్నించిన వృద్ధులపైకి కూడా నక్కలు ఎగబడ్డాయి. దీంతో వారికి కూడా గాయాలయ్యాయి. ఈ దాడి ఘటన తర్వాత మొత్తం 12 మందిని జహనాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో చికిత్స నిమిత్తం చేర్చారు. వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కోపోద్రిక్తులైన స్థానికులు జరిపిన దాడిలో ఒక నక్క హతమైంది.
Also Read :Terror Plot To Attack Pope Francis : పోప్ ఫ్రాన్సిస్‌పై దాడికి ఉగ్ర కుట్ర.. భగ్నం చేసిన ఇండోనేషియా పోలీసులు
పిలిభిత్ జిల్లాలో జరిగిన నక్కల దాడి(Jackal Attack) ఘటన గురించి తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఘటనపై దర్యాప్తును మొదలుపెట్టారు. పిలిభిత్ జిల్లా పక్కనే తోడేళ్ల దాడులతో ప్రభావితమైన బహ్రైచ్ జిల్లా ఉంది. బహ్రయిచ్ జిల్లాలోనూ తోడేళ్ల దాడిలో చనిపోయిన 8 మందిలో 7 మంది పిల్లలే ఉన్నారు. తోడేళ్ల దాడిలో దాదాపు 36 మంది మహిళలు, పిల్లలు, వృద్ధులు గాయపడి ఆస్పత్రుల్లో చేరారు. వారందరికీ యూపీ ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందిస్తోంది. ఆరు తోడేళ్లు కలిసి బహ్రయిచ్ జిల్లాలో ఈ దాడులకు పాల్పడగా.. వాటిలో నాలుగింటిని ఇప్పటికే అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. మిగతా రెండు తోడేళ్లను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.