Sikkim: ఉత్తర సిక్కింలోని రెండు ఎత్తయిన పర్వత ప్రాంతాలైన లాచెన్ , లాచుంగ్ లలో వేలాది మంది పర్యటకులు చిక్కుకుపోయారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం మధ్యాహ్నం నుంచి సిక్కింలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా చుంగ్‌తాంగ్ నుంచి లాచెన్ కు వెళ్లే మార్గంలో మున్షితాంగ్ సమీపంలో.. చుంగ్‌తాంగ్ నుండి లాచుంగ్ కు వెళ్లే మార్గంలో లిమా సమీపంలో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సుమారు 1500 మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు.
కొండచరియలు విరిగి రోడ్లపై పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం భారీ వర్షాలు ప్రారంభమైనప్పుడు లాచెన్, లాచుంగ్‌లలో ఉన్న పర్యాటకులు ఇప్పటికీ కొండ ప్రాంతాల్లోనే ఉన్నారని జిల్లా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే.. కొండచరియలు విరిగిపడటంతో రోడ్డపై చిక్కుకున్న దాదాపు 1500 మంది పర్యాటకులను గురువారం రాత్రి సమీపంలోని గ్రామాలకు తరలించడం జరిగిందని, శుక్రవారం వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగిందని ఎస్పీ భూటియా తెలిపారు. గురువారం రాత్రి వారు గురుద్వారా, ఇండో -టిబెటన్ బోర్డర్ పోలీస్ క్యాంప్ వంటి ప్రదేశాల్లో ఉన్నారు. కొందరికి స్థానిక గ్రామాల ప్రజలు ఆతిధ్యం ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు.
Also Read: Hindalco : మహీంద్రాకు 10,000 అల్యూమినియం బ్యాటరీ ఎన్‌క్లోజర్‌లను అందజేసిన హిందాల్కో
భారీ వర్షాల కారణంగా ఉత్తర సిక్కింకు వెళ్లే అన్ని ప్రయాణ అనుమతులను రద్దు చేసినట్లు సీనియర్ అధికారి తెలిపారు. ఈ ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర సిక్కింకు పర్యాటకులను పంపవద్దని జిల్లా యంత్రాంగం టూర్ ఆపరేటర్లను ఆదేశించింది.
గురువారం రాత్రి అందిన అధికారిక సమాచారం ప్రకారం.. లాచెన్-చుంగ్తాంగ్ రహదారిలోని మున్షితాంగ్ వద్ద, లాచుంగ్-చుంగ్తాంగ్ మార్గంలోని లెమా/బాబ్ వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. 2023 అక్టోబర్‌లో గ్లేసియల్ లేక్ వరదల కారణంగా సిక్కింలో అత్యంత దెబ్బతిన్న ప్రదేశాలలో లాచెన్ ఒకటి. ఈ ప్రాంతం దాదాపు ఒకటిన్నర సంవత్సరాలుగా మూసివేసి ఉంది. ఈ సంవత్సరం మార్చి నుండి పర్యాటకుల కోసం ఇది తెరవబడింది.