Indians Purchasing Power: మన దేశ జనాభా ఇప్పుడు 144 కోట్ల దాకా ఉంది. ఈ జనాభాలో దాదాపు 100 కోట్ల మందికి అంతగా కొనుగోలు శక్తి లేదట. దీంతో వారంతా తమకు ఇష్టమైన వస్తువులను కొనలేకపోతున్నారట. తమకు ఆసక్తి కలిగిన సేవలను పొందలేకపోతున్నారట. ఈమేరకు వివరాలతో బ్లూమ్ వెంచర్స్ సంస్థ సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్‌లో ఉన్న ఆర్థిక అసమానతలకు ఈ గణాంకాలే నిదర్శనం అని పేర్కొంది. ఈ రిపోర్ట్‌లోని కీలక వివరాలను ఈకథనంలో తెలుసుకుందాం..
Also Read :Telangana State Bird: మిషన్ పాలపిట్ట.. రంగంలోకి తెలంగాణ సర్కార్
బ్లూమ్ వెంచర్స్ నివేదికలోని కీలక వివరాలు..
- భారతదేశ జనాభాలో కేవలం 14 కోట్ల మందికే సముచితమైన కొనుగోలు శక్తి(Indians Purchasing Power) ఉంది.
- భారత్‌లోని మరో 30 కోట్ల మంది ప్రస్తుతం తమ కొనుగోలు శక్తిని పెంచుకునే దశలో ఉన్నారు.
- భారతదేశ వస్తు, సేవల వినియోగంలో ఎక్కువ భాగం ఈ 44 కోట్ల మంది నుంచే జరుగుతోంది.
- కరోనా సంక్షోభం అనంతరం భారత్‌లో ధనికుల సంపద ఒక్కసారిగా పెరిగింది. పేదల సంఖ్య కూడా అదే రేటులో పెరిగింది.
- 1990వ దశకంలో భారత దేశంలోని మొత్తం ఆదాయంలో 34 శాతం వాటా బిలియనీర్లదే. ఇప్పుడు ఆ వాటా ఏకంగా 57 శాతానికి పెరిగింది.
- 1990వ దశకంతో పోలిస్తే ఇప్పుడు భారత్‌లో కోట్లాది మంది సామాన్య ప్రజల ఆదాయం 22.2 శాతం నుంచి 15 శాతానికి పడిపోయింది.
- భారత్‌లో అందుబాటు ధరల్లో లభించే ఇళ్ల సంఖ్య గత ఐదేళ్లలో 40 శాతం నుంచి 18 శాతానికి తగ్గిపోయింది.
- గత పదేళ్లలో భారత్‌లో ద్రవ్యోల్బణం పెరిగినా, మధ్యతరగతి వేతనాలు మాత్రం పెరగలేదు. రాబోయే కొన్నేళ్ల పాటు కూడా దేశంలోని మధ్యతరగతి ప్రజలు ఇలాంటి గడ్డుపరిస్థితినే ఎదుర్కోవాల్సి రావచ్చు.
- ఈ అంశాలను భారత ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. అందుకే తాజా కేంద్ర బడ్జెట్‌లో రూ.12.75 లక్షల ఆదాయం ఉన్నవారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించింది.
- ధరల మంట, ఆదాయాలు పెరగకపోవడంతో భారతదేశ ప్రజల పొదుపు శక్తి బలహీనపడింది.
- వ్యక్తిగత రుణాల మంజూరు, క్రెడిడ్ కార్డుల మంజూరు పెరిగింది. దీంతో ప్రజలు రుణ ఊబిలో చిక్కుకున్నారు.