10 Years of PMJDY: ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈరోజు దేశానికి చారిత్రాత్మకమైన రోజు అని ప్రధాని మోదీ అభివర్ణిస్తూ, లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన 10వ వార్షికోత్సవం సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో స్పందించారు. ప్రణాళిక 4 సంవత్సరాల లక్ష్యాన్ని 5 నెలలకు ఎలా తగ్గించారో ఆయన గుర్తు చేశారు.
నీతి ఆయోగ్ సిఇఒ బివిఆర్ సుబ్రహ్మణ్యం బుధవారం జన్ ధన్ యోజన గురించి మాట్లాడుతూ “2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జన్ ధన్ యోజన ఆలోచన వచ్చిందని తెలిపారు. జన్ ధన్ యోజన ప్రారంభానికి ముందు జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ “ప్రతి ఇంటిని కవర్ చేయడానికి ఎంత సమయం పడుతుందని ప్రధాని మోడీ ప్రతి ఒక్క అధికారిని అడిగారు. ఆర్‌బీఐ గవర్నర్‌ను ప్రధాని ఈ ప్రశ్న అడిగినప్పుడు, దానికి నాలుగేళ్లు పడుతుందని అంచనా వేశారు. దీనికి రెండేళ్లు పట్టవచ్చని పీఎంవోలోని మరికొందరు అధికారులు సూచించారని సుబ్రమణ్యం చెప్పారు. అయితే అందుకు కనీసం ఏడాది పడుతుందని ఆయనే స్వయంగా చెప్పారు.
ఈ పనిని జనవరి 26 నాటికి పూర్తి చేస్తామని ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారని సుబ్రహ్మణ్యం చెప్పారు. నాలుగేళ్లుగా అంచనా వేసిన ఈ ప్రాజెక్టు కేవలం ఐదు నెలల్లోనే పూర్తయింది. దీంతో మేమంతా ఆశ్చర్యపోయామని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ నిర్దేశించిన ఈ ప్రతిష్టాత్మక గడువును చేరుకోవడానికి వివిధ శాఖల అధికారులు పగలు రాత్రి శ్రమించారని ఆయన తెలియజేశారు. వారి కృషి ఫలించింది మరియు నిర్ణీత సమయానికి ముందే లక్ష్యాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. బ్యాంకింగ్ సౌకర్యాలు లేని సుమారు 12 కోట్ల మంది ఈ పథకం ప్రారంభించిన 5 నెలల్లోనే అనుసంధానించబడ్డారని ఆయన అన్నారు.
వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28 ఆగస్టు 2014న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనను ప్రారంభించారు. దీని కింద దేశంలోని ప్రతి కుటుంబాన్ని బ్యాంకింగ్ సేవలకు అనుసంధానం చేశారు. ఈ పథకం సమయంలో సుబ్రమణ్యం ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు.
Also Read: Tortoise Ring: తాబేలు ఉంగరం దరిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?