ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Elections) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. గత మూడు ఎన్నికల్లో వరుస విజయాలను సాధించిన ఆప్, ఈసారి బీజేపీకి అధికారం అప్పగించాల్సి వచ్చింది. ప్రజలకు విద్య, వైద్యం, సంక్షేమ పథకాల ద్వారా చేరువైనప్పటికీ, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమికి ప్రధానంగా పలు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఆప్ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా వంటి అగ్రనేతలు అవినీతి కేసుల కారణంగా జైలుకు వెళ్లడం, లిక్కర్ స్కామ్, అధిక ఖర్చుతో సీఎం నివాస నిర్మాణంపై వచ్చిన విమర్శలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. అవినీతి వ్యతిరేక పార్టీగా పేరు తెచ్చుకున్న ఆప్‌పై అవే ఆరోపణలు రావడం, ప్రజల్లో నమ్మకం కోల్పోవడానికి దారి తీసింది.
అలాగే యమునా నది కాలుష్యం, దిల్లీ రోడ్ల దుస్థితి, వరదల నిర్వహణలో వైఫల్యం వంటి సమస్యలు కూడా ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. ఈ అంశాలపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేయడం, వాటికి సరైన సమాధానం ఇవ్వడంలో ఆప్ విఫలం కావడంతో ప్రజలు పార్టీపై వ్యతిరేకంగా మారారు. వీటితో పాటు పార్టీ కీలక నేతలు బీజేపీలో చేరడం, అభ్యర్థుల ఎంపికలో సరిగా వ్యూహాలను రచించకపోవడం కూడా ఓటమికి కారణమయ్యాయి.
ఆప్ ప్రభుత్వం ఉచిత సేవలు అందించినప్పటికీ, అభివృద్ధి పరంగా తక్కువ పనులు చేసిందని విపక్షాలు ఆరోపించాయి. విద్య, మొహల్లా క్లినిక్స్ వంటి పథకాలపై బీజేపీ నెగటివ్ ప్రచారం చేయడం, ప్రభుత్వ హామీలను అమలు చేయడంలో ఆలస్యం కావడం ఆప్ ఓటమిని తీవ్రతరం చేసింది. దిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా, ఉద్యోగాల కల్పన, నీటి కనెక్షన్ల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం వెనుకబడి పోవడం కూడా ఓటర్లను నిరాశ పరచింది. ఓవరాల్ గా అవినీతి ఆరోపణలు, అభివృద్ధి పనుల ఆలస్యం, ప్రజలలో పెరిగిన అసంతృప్తి, విపక్షాల వ్యూహాత్మక ప్రచారం ఆప్‌ను దెబ్బతీశాయి.