హుజురాబాద్ ఓటర్ల‌ కు ఛాలెంజ్..ఆత్మ‌గౌర‌వం,అహంకారం, భూ క‌బ్జాలు, ద‌ళిత‌బంధు అస్త్రాలు

  • Written By:
  • Updated On - October 26, 2021 / 11:55 AM IST

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల తెలంగాణలోని మిగిలిన ఎన్నిక‌ల కంటే ప్ర‌త్యేక‌మైన‌ది. గ‌తంలో ఎన్నో ఉప ఎన్నిక‌ల‌ను చూసిన తెలంగాణ ప్ర‌జ‌లు ఈసారి హుజురాబాద్ లో కొత్త పోక‌డ‌ల‌ను చూస్తున్నారు. సుమారు నాలుగు నెల‌లు క్రితం ప్ర‌చారం ప్రారంభం అయింది. ఈనెల 30వ తేదీన జ‌రిగే ఉప ఎన్నిక కోసం సుదీర్ఘ ప్ర‌చార‌ హ‌డావుడి కొన‌సాగుతోంది. ఒక విడ‌త ఈటెల రాజేంద్ర పాద‌యాత్ర చేశాడు. ఇంకో వైపు ఈటెల‌ను ఓడించాల‌ని కేవ‌లం హుజురాబాద్ కు 2వేల కోట్ల ద‌ళితబంధు నిధుల‌ను కేసీఆర్ పంపించాడు. హోరాహోరీగా ఉప ఎన్నిక ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రజ‌ల‌కు, కేసీఆర్ డ‌బ్బుకు మ‌ధ్య ఈ ఎన్నిక జ‌రుగుతోంద‌ని ఈటెల అంటున్నాడు. భూ క‌బ్జాల‌కు, అభివృద్ధికి మ‌ధ్య ఈ ఉప ఎన్నిక చోటుచేసుకుంద‌ని ఆర్థిక మంత్రి హ‌రీశ్ ఫోక‌స్ చేస్తున్నాడు.
అన్నీ తానై హ‌రీశ్ ఉప ఎన్నిక వ్యూహాల‌ను ర‌చిస్తున్నాడు. టీఆర్ ఎస్ పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరున్న హ‌రీశ్ అనేక సంద‌ర్భాల్లో అనుకూల‌మైన ఫ‌లితాల‌ను సాధించాడు. ఇటీవ‌ల జ‌రిగిన దుబ్బాక ఉప ఎన్నిక‌లో మాత్రం ఆయ‌న వ్యూహాలు బెడిసి కొట్టాయి. ఇప్పుడు కూడా అదే త‌ర‌హాలో హుజురాబాద్ లో భూ రాంగ్ అవుతాయ‌ని ఈటెల విశ్వ‌సిస్తున్నాడు. ఇప్పుడు ఈటెల‌, హ‌రీశ్ ఇద్ద‌రూ రాజ‌కీయంగా మంచి మిత్రులు. ఇద్దరూ క‌లిసి కొత్త పార్టీ పెట్ట‌బోతున్నార‌ని ఒక‌నొక సంద‌ర్భంలో ప్ర‌చారం జ‌రిగింది. రాబోయే రోజుల్లో కేసీఆర్ కు ప‌క్క‌లో బ‌ల్లెం మాదిరిగా ఈటెల‌, హ‌రీశ్ త‌యారు అవుతార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా భావించారు. కానీ, హ‌ఠాత్తుగా ఈటెల రాజేంద్ర మీద వ్యూహాత్మ‌కంగా భూ క‌బ్జాల వ్య‌వ‌హారాన్ని కేటీఆర్ తెర‌మీద‌కు తీసుకొచ్చాడు. పొమ్మ‌న‌లేక పొగ పెట్ట‌డంతో విధిలేని ప‌రిస్థితుల్లో ఈటెల పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. దాని ఫలితం ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక‌.
ఈటెల మీద విచార‌ణకు సీఐడీ సిద్ద‌మ‌వుతోన్న టైంలో వ్యూహాత్మ‌కంగా బీజేపీ తీర్థం తీసుకున్నాడు ఈటెల‌. అనివార్యంగా ఆ పార్టీ అభ్య‌ర్థిగా రాజేంద్ర పోటీకి దిగాడు. బ్యాక్ బెంచ్ స్థానం ఇస్తున్న‌ప్ప‌టికీ అవ‌మానాల‌ను భ‌రిస్తూ బీజేపీ టిక్కెట్ నుంచి బ‌రిలోకి దిగాడు. ఇదే అంశాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్ర‌చార అస్త్రంగా తీసుకుంది. భూ క‌బ్జాల కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఈటెల ఆడుతున్న గేమ్ గా హ‌రీశ్ ఆరోపిస్తున్నాడు. క‌రోనా స‌మ‌యంలో కేంద్రం వైఫ‌ల్యం మీద మాట్లాడిన ఈటెల ఆ పార్టీలో పోటీ చేసి ఓట్లు అడ‌గ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నాడు. హ‌రీశ్ కు ధీటుగా ఈ ఎన్నిక అహంకారానికి, ఆత్మ‌గౌర‌వానికి మ‌ధ్య జరుగుతోన్న ఎన్నిక‌గా ఈటెల ప్ర‌చారం చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈటెల అనుచ‌రుల‌ను టీఆర్ ఎస్ పార్టీలోకి తీసుకుంది. వాళ్లు అంద‌రూ భౌతికంగా త‌నకు దూరం అయిన‌ప్ప‌టికీ మాసికంగా అభిమానం త‌న‌పై ఉంద‌ని ఈటెల విశ్వ‌సిస్తున్నాడు. నువ్వా, నేనా అంటూ బీజేపీ, టీఆర్ఎస్ ప్ర‌చారం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌ల్మూరి వెంక‌ట్ యూత్ కోటా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. రేవంత్ పీసీసీ అయిన త‌రువాత జ‌రుగుతోన్న తొలి ఎన్నిక కావ‌డంతో క‌నీసం ప‌రువు నిలుపుకోవాల‌ని ఆ పార్టీ భావిస్తోంది. ప్ర‌ధాన పార్టీల ఓట్ల‌ను వెంక‌ట్ చీల్చే అవ‌కాశం ఉంది. ఎవ‌రి ఓట్లను భారీగా కాంగ్రెస్ పార్టీ చీల్చుతుంద‌నే దానిపై గెలుపు ఓట‌ములు ఆధార‌ప‌డ్డాయి. పైగా ఈటెల‌కు డూ ఆర్ డై స‌మ‌స్యగా ఈ ఎన్నిక ఉంటే, 2023 సాధార‌ణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఈ ఉప ఎన్నిక‌ల ప్ర‌భావం ఉంటుంద‌ని టీఆర్ఎస్ భావిస్తోది. సో..ఏ కోణం నుంచి చూసిన హుజురాబాద్ ఉప ఎన్నిక అంద‌రికీ కీల‌కమే.