హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగ్గురికి ప్రతిష్టాత్మకమే

ఇంకా ఎన్నికలు జరగకముందే హుజురాబాద్ ఉప ఎన్నిక దేశంలోనే కాస్ట్లీ ఉపఎన్నికగా రికార్డు సాధించిందని చెప్పుకోవచ్చు.

  • Written By:
  • Updated On - October 27, 2021 / 03:28 PM IST

ఇంకా ఎన్నికలు జరగకముందే హుజురాబాద్ ఉప ఎన్నిక దేశంలోనే కాస్ట్లీ ఉపఎన్నికగా రికార్డు సాధించిందని చెప్పుకోవచ్చు. దీనికి కారణం అక్కడ పోటీ చేసే మూడు ప్రధానమైన పార్టీలు ఆ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే. ఈ ఎన్నికల్లో పోటీ మూడు ప్రధానమైన పార్టీల మధ్య కనిపించినా నిజమైన పరీక్ష కేసీఆర్, ఈటెల, రేవంత్ లకే.

ఈ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా టీఆర్ఎస్ ప్రభుత్వానికి గానీ పార్టీకి గానీ వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ కేసీఆర్ కి కుడిభుజంగా ఉంటూ టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2 గా మెలిగిన ఈటెల తనకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం కాబట్టి ఈ పోరులో కేసీఆర్ కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే రాజకీయంగా కేసీఆర్ కి పెద్ద దెబ్బ పడ్డట్టే. దానితో పాటు ఈటెల చేసిన ఆరోపణలు, విమర్శలకు మరింత క్రెడిబిలిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్ ఈ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకున్నారు.

ఇన్ని రోజులు పార్టీలో, ప్రభుత్వంలో హై పొజిషన్ లో ఉన్న ఈటెల ఈ ఎన్నికల్లో గెలవకపోతే తాను ఇన్ని రోజులు గెలిచింది కేసీఆర్ ఇమేజ్ వల్లే అని ప్రజల్లో చులకన అవడంతో పాటు, ఇటు బీజేపీలో కూడా చెల్లని నాణెం లాగా అయ్యే అవకాశముంది కాబట్టి ఈటెలకి ఈ ఎన్నిక ప్రధానమైందే. ఇక టీపీసీసీ చీఫ్ గా నియామకమైన తర్వాత రేవంత్ ఫేస్ చేసే మొదటి ఎన్నిక ఇది. ఇన్ని రోజులు గాంధీ భవన్ నుండి ప్రగతి భవన్ కి వెళ్లే లీకుల వల్లే ప్రతి ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని కాంగ్రెస్ లోని కొంత లేయర్ అనుకుంటూ వచ్చింది. రేవంత్ పగ్గాలు పట్టాకా ఆ పార్టీలో ఒక జోష్ కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ఓడిపోతే కాంగ్రెస్ ని ఎవరొచ్చినా బాగుచేయలేరనే విమర్శలు ఉంటాయి. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ పై వచ్చే ఇన్సైడ్ కామెంటరీకి చెక్ పొట్టోచ్చు. ఇలా పై అంశాలతో మూడు పార్టీలకి హుజురాబాద్ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకమని చెప్పొచ్చు. హుజురాబాద్ ప్రజలు ఈ ముగ్గురు రాష్ట్ర స్థాయి నాయకుల్లో ఎవరికి దీపావళి గిఫ్ట్ ఇస్తారో చూడాలి.