కేసీఆర్ కు షాక్.. దళితబంధుకు బ్రేక్!

హుజూరాబాద్ ఉప ఎన్నిక ముంగిట ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ తగిలింది. ఉప ఎన్నిక గెలుపు కోసం, దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే.

  • Written By:
  • Publish Date - October 19, 2021 / 12:57 PM IST

హుజూరాబాద్ ఉప ఎన్నిక ముంగిట ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ తగిలింది. ఉప ఎన్నిక గెలుపు కోసం, దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పథకం ద్వారా హుజూరాబాద్ లో గెలిచి, లాభపడాలని భావించిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈసీ గట్టి షాక్ ఇచ్చింది. ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలును వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దళిత బంధు అనేది ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు అందుతాయి. దళితుల సాధికారత కోసం ఉద్దేశించిన పథకం అక్టోబర్ 30 న ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు అమలును నియోజకవర్గంలో అన్ని విధాలుగా వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని ఆదేశించింది. అక్టోబర్ 19 మధ్యాహ్నం 2 గంటలలోపు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. దళితుల సాధికారత లక్ష్యంగా ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,000 కోట్లు విడుదల చేసింది. ఈ పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబం ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి, స్వయం ఉపాధి సాధించడానికి రూ. 10 లక్షలు గ్రాంట్‌గా పొందుతుంది. అయితే రాష్ట్రంలో ఇతర చోట్లా కాకుండా, ఒక్క హుజూరాబాద్ లోనే ఈ పథకం ప్రారంభించడంతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇది కేవలం ఓటర్లను ఆకర్షించడానికి మాత్రమే ఈ పథకం ప్రభుత్వం తీసుకొచ్చిందని వివిధ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ మాత్రం ఖండించింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక షెడ్యూల్ తర్వాత కొనసాగుతున్న పథకాలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తించదని ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయెల్ అన్నారు.

ఇదిలా ఉండగా.. నాలుగు మండలాల్లో దళిత బంధు పథకం అమలు కోసం ప్రభుత్వం సోమవారం రూ .250 కోట్లను విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతకాని మండలానికి రూ .100 కోట్లు, సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, అచ్చంపేటలోని చారకొండ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లాలోని కలువకుర్తి నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్కటి రూ .50 కోట్లు విడుదల చేసింది. భూ ఆక్రమణ ఆరోపణలపై రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ వైదొలగడంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకొని బరిలో దిగారు. ఉప ఎన్నిక ముంగిట దళిత బంధు పథకానికి బ్రేక్ పడటంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి దెబ్బతగిలినట్టైందని చెప్పక తప్పదు.