పక్కా స్కెచ్ తోనే కేసీఆర్ ప్రెస్ మీట్స్

తెలంగాణ సీఎం కేసీఆర్ వరుస ప్రెస్మీట్ల వెనుక రాజకీయ కారణాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Written By:
  • Publish Date - November 9, 2021 / 02:02 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ వరుస ప్రెస్మీట్ల వెనుక రాజకీయ కారణాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడు తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టగలిగే పార్టీ లేదనే చెప్పుకోవాలి. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచినా ఆ గెలుపులో బీజేపీకి కాకుండా ఆయా అభ్యర్థులకు మాత్రమే క్రెడిట్ ఇవ్వాలి. అయితే ఎన్నికల్లో బీజేపీ తన ఓటు బ్యాంకును, కొన్ని సీట్లను పెంచుకోగలదేమో కానీ అధికారంలోకి వచ్చే సీన్ అయితే లేదనే చెప్పొచ్చు.

తెలంగాణ ఇచ్చిన పార్టీగానే కాకుండా ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన పథకాలతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో మంచి ఆదరణే ఉంది. నాయకత్వ లోపంవల్ల కాంగ్రేస్ జీరోకి పడిపోయింది. రేవంత్ పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటినుండీ వరుస కార్యక్రమాలతో కాంగ్రెస్ మళ్ళీ గాడిన పడుతోంది. తెలంగాణలో ఆల్ట్రనేటివ్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నా పలు కారణాలవల్ల బీజేపీ పట్ల తెలంగాణ సమాజం మొగ్గుచూపదనే చెప్పాలి. ఇక ఇక్కడ టీడీపీ పూర్తిగా చనిపోయింది. జనసేన, షర్మిల లాంటి పార్టీలకి అసలిక్కడ స్కోపే లేదు. నిలబడుతాడనుకున్న కోదండరాం తడబడుతున్నాడు. ఈ నేపథ్యంలో కాంగ్రేస్ పార్టీ వైపే ప్రజల ఆలోచనలు వెళ్లే అవకాశం మెండుగా ఉంది.

రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ని ఆల్ట్రనేటివ్ అనుకుంటే తనకి కష్టమవుతుందని భావించిన కేసీఆర్ కావాలనే బీజేపీని గ్లోరిఫై చేస్తున్నాడని అన్పించక మానదు.బీజేపీలో ఉన్న అతికొద్ది మంది క్యాండెట్లతో తప్పా ఆ పార్టీతో ఇప్పటికిప్పుడు టిఆర్ఎస్ కి వచ్చే ఇబ్బంది లేదు. కానీ కాంగ్రెస్ పరిస్థితి అలా కాదు. అందుకే ప్రజలు కాంగ్రెస్ ని కాకుండా బీజేపీనే ఆల్ట్రనేటివ్ అనుకోవాలని కేసిఆర్ రోజూ బీజేపీని విమర్శించి క్రెడిట్ ఇస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.