Morning Mistakes: ఉదయం వేళ మనం చేసే పనులు ఆ రోజంతా మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. నిద్ర లేచిన తర్వాత మొదటి కొన్ని గంటలు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం సమయంలో రక్తపోటు, కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సమయంలో హార్ట్ అటాక్ వచ్చే ముప్పు ఎక్కువ. ఈ సమయంలో కొన్ని తప్పుడు అలవాట్లు తోడైతే గుండెపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. మీ జీవితకాలాన్ని తగ్గించే ఆ ఉదయపు అలవాట్లు ఏంటో, వాటిని ఎందుకు మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.
నిద్ర లేవగానే నీళ్లు తాగకపోవడం
రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం స్వల్పంగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఉదయాన్నే నీళ్లు తాగకపోతే రక్తం చిక్కబడే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తాన్ని పంప్ చేయడానికి గుండె ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. నీళ్లకు బదులు నేరుగా టీ లేదా కాఫీ తాగడం వల్ల గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. అందుకే లేవగానే నీళ్లు తాగి శరీరాన్ని రిలాక్స్ చేయాలి.
Also Read: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అభిషేక్ శర్మ!
వార్మప్ లేకుండా వేగంగా వ్యాయామం చేయడం
ఉదయం వ్యాయామం మంచిదే కానీ నిద్ర లేవగానే ఒక్కసారిగా హై-ఇంటెన్సిటీ వర్కౌట్స్ (భారీ వ్యాయామాలు) చేయడం ప్రమాదకరం. నిద్ర తర్వాత రక్త నాళాలు కొంచెం బిగుతుగా ఉంటాయి. అటువంటి స్థితిలో అకస్మాత్తుగా ఒత్తిడి పెంచడం గుండెకు షాక్ ఇవ్వవచ్చు. ముందుగా తేలికపాటి స్ట్రెచింగ్ లేదా వాకింగ్‌తో మొదలుపెట్టడం సురక్షితం.
రక్తపోటును తనిఖీ చేయకపోవడం
అధిక రక్తపోటును ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు. బీపీ సమస్య ఉన్నవారికి ఉదయం పూట అది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా ఉదయాన్నే బీపీ చెక్ చేసుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యల ముందస్తు సంకేతాలను గుర్తించవచ్చు.
ఉప్పు ఎక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ చేయడం
ఊరగాయలు, ప్రాసెస్ చేసిన బ్రెడ్ లేదా రెడీ-టు-ఈట్ స్నాక్స్ వంటి ఉప్పు అధికంగా ఉండే అల్పాహారం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఉదయాన్నే సోడియం ఎక్కువగా తీసుకోవడం గుండెపై భారాన్ని పెంచుతుంది. దీనికి బదులుగా పండ్లు, ఓట్స్ లేదా మొలకెత్తిన గింజలు వంటి సమతుల్య ఆహారం తీసుకోవడం మేలు.
మంచం మీద ఉండగానే మొబైల్ లేదా ఈమెయిల్స్ చూడటం
కళ్లు తెరవగానే ఆఫీస్ ఈమెయిల్స్ లేదా సోషల్ మీడియా చూడటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కార్టిసాల్ స్థాయిలు, రక్తపోటు పెరిగి చాలా సేపు అలాగే ఉంటాయి. ప్రశాంతమైన ఉదయం గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరం.
అల్పాహారం మానేయడం
Frontiersin పరిశోధన పత్రికలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. అల్పాహారం మానేయడం వల్ల శరీరం ఒత్తిడికి లోనవుతుంది. హార్మోన్ల అసమతుల్యత పెరుగుతుంది. క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ మానేసే వారిలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. గుండె, బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులో ఉండాలంటే ఉదయాన్నే పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
