Vitamin D : విటమిన్ డి సప్లిమెంట్స్ అతిగా తీసుకుంటే ప్రాణానికే ముప్పు…ఈ సమస్యలు తప్పవు..!!

అతి అనర్థాలకు దారి తీస్తుంది. ఇది అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యానికి ప్రొటిన్ ఫుడ్స్ ఎక్కువగా తినమని వైద్యులు సలహా ఇస్తుంటారు. కానీ అదే ప్రొటీన్ ఎక్కువైతే ఎన్నో రకాల సమస్యలకు దారి తీస్తుంది.

  • Written By:
  • Publish Date - July 7, 2022 / 07:00 AM IST

అతి అనర్థాలకు దారి తీస్తుంది. ఇది అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యానికి ప్రొటిన్ ఫుడ్స్ ఎక్కువగా తినమని వైద్యులు సలహా ఇస్తుంటారు. కానీ అదే ప్రొటీన్ ఎక్కువైతే ఎన్నో రకాల సమస్యలకు దారి తీస్తుంది. విటమిన్స్ అధికమోతాదులో తీసుకున్నా సమస్యలు తప్పవు. ముఖ్యంగా విటమిన్ డి అతిగా తీసుకుంటే వాంతులు, ఆకలి మందగించడం, తలతిరగడం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తాయి.

ఈ ప్రమాదాల గురించి అవగాహనలేక కొందరు విటమిన్ డి సప్లిమెంట్స్ క్రమం తప్పకుండా తీసుకుంటుంటారు. దీంతో అవసరానికి మించి విటమిన్ డి శరీరానిని అందే అవకాశం ఉంటుంది. ఫలితంగా కాల్షియం, సీరం క్రియాటినిన్ లెవెల్స్ ప్రమాదకరస్థాయిల పెరుగుతాయి. సీరం క్రియాటినిన్ అంటే కండరాల నుంచి రక్తంలోకి చేరే వ్యర్థాలు. ఈ వ్యర్థాల లెవెల్స్ పెరిగితే రకరకాల అనారోగ్యాలు వస్తాయి. అందుకే వైద్యులు కూడా విటమిన్ డి ఎక్కువగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

కాకాపోతే చాలామంది విటమిన్ డి లోపంతో బాధపడుతుంటారు. వీరిలో కొందరు విటమిన్ డి లోపాన్ని అధిగమించేందుకు ఇష్టానుసారంగా సప్లిమెంట్స్ తీసుకుంటారు. ఒక్కోసారి సప్లిమెంట్స్ ను అవసరమైన దానికంటే ఎక్కువ మోతాదులో వైద్యులు సూచిస్తుంటారు. కారణం ఏదైనా విటమిన్ డి ఓవర్ డోస్ శరీరానికి తీవ్రహాని కలిగిస్తుంది. కిడ్నీల పనితీరు దెబ్బతినడానికి ప్రధాన కారణాల్లో విటమిన్ డి అతిగా తీసుకోవడం కూడా ఒక కారణంగా వైద్యులు చెబుతున్నారు. శరీరంల విటమిన్ డి మోతాదు పెరిగితే కాల్షియం లెవల్స్ పెరుగుతుంటాయి. అధిక కాల్షియంను కిడ్నీలు తేలిగ్గా ఫిల్టర్ చేయలేవు. దీంతో ఎక్కువగా దాహం వేస్తుంది. తరచుగా యూరిన్ వస్తుంది. కడుపునొప్పి, వికారం, వాంతులు, మలబద్ధకానికి కారణం అవుతుంది. తీవ్రమైన సమస్యలు కూడా వచ్చే ముప్పు ఉంది.

మారుతున్న జీవనశైలి, సూర్యరశ్మిలో ఎక్కువ సమయం ఉండకపోవడం వల్ల విటమిన్ డి లోపంతో చాలా మంది బాధపడుతున్నారు. అందుకే సప్లిమెంట్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. కొంతమంది వైద్యుల సలహా లేకుండానే స్వతహాగా తీసుకుంటున్నారు. నోటిద్వారా తీసుకునే సప్లిమెంట్స్ ఆరోగ్యకరమైన మోతాదులో ఉంటే ఎలాంటి హాని ఉండదని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ మోతాదు ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే మాత్రం అనారోగ్యం బారిన పడటం ఖాయం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ విటమిన్ ను మోతాదుకు మంచి తీసుకుని మరణించినవారు కూడా ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు.