Curd in Lunch: పెరుగు.. ఇందులో ఉండే మంచి బాక్టీరియా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆహారంలో భాగంగా పెరుగును కూడా తింటుంటాం. తాజా పెరుగు చాలా రుచిగా ఉంటుంది. ప్రతిరోజూ చేసే భోజనాన్ని పెరుగుతో ముగించకపోతే.. కొందరికి భోజనం చేసినట్టు కూడా అనిపించదు. చాలామంది పెరుగును డిసర్ట్ గా, స్నాక్ గా కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ.. పెరుగును భోజనంతో కలిపి తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనంలో మాత్రం పెరుగు తినకూడదని చెబుతున్నారు.
రాత్రి భోజనం తర్వాత పెరుగు తింటే కడుపులో గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
పెరుగును మధ్యాహ్న భోజనంలో తినడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. కారిస్టాల్, స్టెరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించి.. బరువు పెరగకుండా అదుపు చేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. పెరుగు తినడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.
ముఖ్యంగా మహిళలు మధ్యాహ్న భోజనంలో పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల యోని ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. పెరుగులో ఉండే లక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా యోని ఇన్ఫెక్షన్లు రాకుండా అరికట్టడంలో దోహదపడతాయి. అధిక రక్తపోటు సమస్య కూడా అదుపులో ఉంటుంది.
మధ్యాహ్న భోజనంతో పెరుగును తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. ఉదర సంబంధిత సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. విడిగా పెరుగును తినేకంటే.. భోజనంలో కలిపి తీసుకుంటే మరింత మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.