మానవ శరీరంలో మూత్రపిండాలు (Kidneys ) అత్యంత కీలకమైన అవయవాలు. ఇవి రోజువారీగా మన రక్తాన్ని శుభ్రపరిచి, శరీరంలో వెస్ట్ పదార్థాలను మూత్ర రూపంలో బయటకు పంపుతాయి. అయితే చాలా మంది ఈ అవయవాల పట్ల సరైన శ్రద్ధ తీసుకోవడం లేదు. దాంతో కిడ్నీ రాళ్లు, ఇన్ఫెక్షన్లు, ఫెయిల్యూర్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కిడ్నీ వ్యాధులు నరాలపై, గుండె ఆరోగ్యంపై, రక్త హీమోగ్లోబిన్ స్థాయిపై ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే దినసరి నీటి సేవనంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. శరీరం హైడ్రేట్‌గా ఉంటే మూత్ర మార్గం క్లీన్‌గా ఉంటుంది. ఫలితంగా కిడ్నీ రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. ప్రతి రోజు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు కిడ్నీలకు మేలు చేస్తాయి. అదే సమయంలో ఉప్పు ఎక్కువగా ఉన్న ఫాస్ట్‌ఫుడ్స్, ప్రాసెస్ చేసిన పదార్థాలను నివారించాలి.
Amazon prime day offers : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీగా డిస్కౌంట్ ఆఫర్స్
కిడ్నీలకు మరో కీలక శత్రువు మోతాదు మించిన షుగర్ స్థాయి. డయాబెటిస్ కారణంగా మూత్రపిండాల్లోని చిన్న రక్త నాళాలు దెబ్బతిని, కాలక్రమంలో కిడ్నీ పనితీరు తగ్గిపోతుంది. దీనివల్ల కిడ్నీ వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. అలాగే, నిత్య జీవితంలో ఫిజికల్ ఆక్టివిటీ లేకపోవడం, అధిక బరువు, రక్తపోటు నియంత్రణలో లేకపోవడం మూత్రపిండాల పనితీరును దెబ్బతీయవచ్చు. అందుకే వ్యాయామాన్ని నిత్యక్రమంలో భాగం చేసుకోవాలి.
కిడ్నీలపై ప్రభావం చూపే ఇంకొక అంశం నొప్పి నివారణ మందుల అధిక వినియోగం. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDs) తరచూ లేదా ఎక్కువ మోతాదులో తీసుకుంటే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే ధూమపానం వల్ల కూడా రక్తనాళాలు దెబ్బతిని కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మంచి జీవనశైలి, సమతుల్య ఆహారం, రోజూ తగినంత నీరు, వ్యాయామం వంటి అలవాట్లతో కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చిన్న తప్పిదాలు పెద్ద సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉన్నందున, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.