స్త్రీలు ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో చాలా రకాల జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహించాలని చెబుతుంటారు. అలాగే గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని రకాల ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోమని చెబుతుంటారు. అటువంటి వాటిలో దానిమ్మ పండు కూడా ఒకటి. దానిమ్మను తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు పదేపదే సూచిస్తూ ఉంటారు. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి6, సోడియం, పొటాషియం, డైటరీ ఫైబర్, కాల్షియం మెగ్నీషియం, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి.
దానిమ్మ పండులో ఉండే పోషకాలు తల్లితో పాటు బిడ్డకు కూడా ఎంతో మేలు చేస్తాయి. దానిమ్మ పండును తినడం వల్ల గర్భిణుల్లో వాంతులు, రక్తహీనత సమస్యల నుంచి కొంత వరకు ఉపశమనం పొందవచ్చు. దానిమ్మ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, శరీర బరువును కూడా అదుపులో ఉంచుతుంది. దానిమ్మను నేరుగా అయినా తినవచ్చు లేదంటే జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. గర్భధారణ సమయంలో శరీర నొప్పులు సర్వ సాధారణం. అయితే దీనికి దానిమ్మ మంచి పరిష్కారం. ఈ పండులోని పొటాషియం దీనికి సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో కాళ్ల నొప్పులు, వెన్నునొప్పిని తగ్గించడానికి ఈ పండు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
అంతేకాకుండా బీపీని నియంత్రించడానికి కూడా పొటాషియం బాగా పనిచేస్తుంది. అలాగే దానిమ్మ పీచు కడుపులోని శిశువు మెదడు ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. ఈ పండు శిశువు తెలివితేటలు, నరాల పెరుగుదల, నాడీ సంబంధిత రుగ్మతలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అలాగే దానిమ్మ జ్యూస్ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. దానిమ్మ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. అలాగే హృదయ సంబంధ సమస్యలను తగ్గించడానికి కూడా ఈ జ్యూస్ సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే దానిమ్మ పండు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుందట. ఈ పండులో ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుందని, దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు.