Blood Pressure: చలికాలంలో కొంచెం నిర్లక్ష్యం చేసినా హై బ్లడ్ ప్రెజర్ ఉన్న రోగులకు అది ప్రాణాంతకం కావచ్చు. చలి వాతావరణంలో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో శరీర రోగనిరోధక శక్తి తగ్గడమే కాకుండా శారీరకంగా కూడా బలహీనపడతారు. ముఖ్యంగా ఉదయం పూట బీపీ అకస్మాత్తుగా పెరగడానికి కారణాలేంటో? దాని నుండి ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వైద్యుల ప్రకారం.. చలికాలంలో రక్త నాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగక, నరాలలో రక్తం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. ఇది గుండె ధమనులపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
చలికాలంలో ఉదయాన్నే బీపీ ఎందుకు పెరుగుతుంది?
సాధారణంగా హై బీపీ, గుండె జబ్బులు, థైరాయిడ్ లేదా మధుమేహం ఉన్నవారిలో ఉదయం నిద్రలేవగానే రక్తపోటు పెరగడం కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఉష్ణోగ్రత మార్పు: రాత్రంతా వెచ్చని దుప్పటిలో లేదా హీటర్ దగ్గర ఉన్న శరీరం అకస్మాత్తుగా బయటకు రాగానే చల్లబడుతుంది. దీనివల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తాన్ని పంప్ చేయడానికి గుండె ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఫలితంగా బీపీ పెరుగుతుంది.
ఒత్తిడి: దీర్ఘకాలిక ఆందోళన వల్ల శరీరంలో కార్టిసాల్, అడ్రినాలిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి హృదయ స్పందనను, రక్తపోటును పెంచుతాయి.
మధుమేహం: డయాబెటిస్ రక్తనాళాలు, మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఉదయం పూట రక్త ప్రసరణలో ఒత్తిడి పెరుగుతుంది.
శ్వాస సమస్యలు: నిద్రలో శ్వాస సరిగ్గా అందకపోతే ఆక్సిజన్ లోపం ఏర్పడి శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఉదయాన్నే హై బీపీకి దారితీస్తుంది.
ఉప్పు వాడకం: పడుకునే ముందు ఉప్పు ఎక్కువగా ఉన్న లేదా వేయించిన పదార్థాలు తింటే శరీరంలో నీరు నిలిచిపోయి మరుసటి రోజు ఉదయం రక్తపోటు పెరుగుతుంది.
మద్యపానం: మద్యం సేవించడం వల్ల నిద్రకు ఆటంకం కలగడమే కాకుండా శరీరంలోని ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది.
Also Read: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 63 బంతుల్లోనే సెంచరీ!
మార్నింగ్ హైపర్ టెన్షన్ లక్షణాలు
ఉదయాన్నే విపరీతమైన తలనొప్పి, కళ్లు తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన, అలసట, కళ్లలో ఒత్తిడి వంటివి దీని ప్రధాన లక్షణాలు. వీటిని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది.
ఎలా నివారించాలి?
నెమ్మదిగా నిద్రలేవండి: నిద్రలేవగానే అకస్మాత్తుగా పడక మీద నుండి దిగకుండా కొద్దిసేపు కూర్చుని నెమ్మదిగా లేవండి.
వెచ్చని దుస్తులు: శరీరాన్ని చలి నుండి రక్షించుకోవడానికి తగినన్ని ఉన్ని దుస్తులు ధరించండి.
వ్యాయామం: ప్రతిరోజూ 20 నుండి 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామం చేయండి.
ఆహారం: ఉప్పు తగ్గించండి. సమతుల్య ఆహారం తీసుకోండి.
నీరు: చలికాలంలో కూడా తగినంత నీరు త్రాగాలి. గోరువెచ్చని నీరు త్రాగడం ఇంకా మంచిది.
ఔషధాలు: డాక్టర్ సూచించిన మందులను సరైన సమయానికి వేసుకోవాలి. తరచుగా బీపీని చెక్ చేయించుకోవాలి.
చలి ఎక్కువగా ఉన్నప్పుడు (ఉదయం, సాయంత్రం) బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటివి సహాయపడతాయి.
