అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు అరటిపండును ఇష్టపడి తింటూ ఉంటారు. చాలా రకాల స్వీట్లు తయారీలో అలాగే జ్యూసులు తయారీలో కూడా అరటి పండ్లను ఉపయోగిస్తూ ఉంటారు. అరటి పండులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే అరటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండు ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది.
అంతేకాకుండా వ్యాయామాలు, జిమ్ చేసేవారు అరటిపండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాయి. అరటిపండు అనేది పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6, ఫాస్పరస్ వంటి విటమిన్లు, ఖనిజాల గని. జీర్ణశక్తిని బలోపేతం చేయడం, బరువు తగ్గడం, బరువు పెరగడం, బలమైన ఎముకలు, శక్తి స్థాయిలను పెంచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, రక్తంలో చక్కెరను నియంత్రించడం వంటి అనేక ప్రయోజనాలను అరటిపండు అందిస్తుంది. అయితే అరటిపండు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు.
మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు అరటిపండు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కిడ్నీ సమస్యలు, మూత్రపిండ వ్యాధులతో బాధపడేవారు అరటి పండును ఎక్కువగా తినకూడదట. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తినడం వల్ల పొటాషియం ను విసర్జించడం మూత్ర పిండాలకు కష్టంగా ఉంటుందట. డయాబెటిస్ సమస్యలు ఉన్నవారు కూడా అరటి పండును ఎక్కువగా తినకూడదట. అరటి పండు చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. షుగర్ రోగులు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ప్రమాదముందట. దీంతో కొంత సేపు ఎనర్జీగా అనిపించినా ఆ తర్వాత నీరసంగా అయిపోతారట.
అలాగే మలబద్ధకం, గ్యాస్ సమస్యలు ఉన్నవారు అరటి పండును ఎక్కువగా తినకూడదట. మితంగా మాత్రమే తినాలని చెబుతున్నారు. ఎక్కువగా తింటే మలబద్ధక సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందట. అంతేకాకుండా ఎక్కువ తినడం కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు, ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే ఈ సమస్యలతో బాధపడేవారు అరటి పండును ఎక్కువగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అలర్జీ, శ్వాసకోస సమస్యలు, అస్తమాతో బాధపడే వారు అరటి పండుకు దూరంగా ఉంటేనే మంచిదట. అరటి పండు తింటే వీరిలో అలర్జీ రియాక్షన్స్ మొదలయ్యే ప్రమాదం ఉందట. చర్మంపై ఎరుపు, దురద, మంట, వాపు వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు నిపుణులు.