Nipah Virus: పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం నిపా వైరస్ కలకలం సృష్టిస్తోంది. అక్కడ ఇద్దరు నర్సులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారిద్దరూ బారాసత్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో విషమ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్తతో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యాయి. ఆరోగ్య శాఖ యుద్ధ ప్రాతిపదికన దీనిని నియంత్రించే పనిలో పడింది. బెలేఘాటా ఐడి ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయడమే కాకుండా, అత్యవసర బెడ్‌లను కూడా సిద్ధంగా ఉంచారు.
చాలా మందికి ఈ వైరస్ గురించి అవగాహన లేదు
సమస్య ఏమిటంటే.. ఈ ప్రమాదకరమైన వైరస్ గురించి చాలా మందికి కనీస సమాచారం కూడా తెలియదు. ఏ ఆహార పదార్థాల ద్వారా నిపా వైరస్ వ్యాపిస్తుందో వారికి అవగాహన లేదు. నిపా ప్రధానంగా గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుందనేది నిజం. కానీ మీ శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశించే అవకాశం ఉన్న కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
నిపా వైరస్ ప్రారంభ లక్షణాలు (2–14 రోజుల్లో కనిపించవచ్చు)
- తీవ్రమైన జ్వరం
- తలనొప్పి
- ఒంటి నొప్పులు / కండరాల నొప్పులు
- గొంతు నొప్పి
- వాంతులు లేదా వికారం
- అలసట- బలహీనత
- దగ్గు, జలుబు వంటి లక్షణాలు
తీవ్రమైన లక్షణాలు (ఇన్‌ఫెక్షన్ పెరిగినప్పుడు)
- కళ్ళు తిరగడం, గందరగోళ పరిస్థితి
- మాట్లాడటంలో లేదా నడవడంలో ఇబ్బంది
- స్పృహ కోల్పోవడం
- ఫిట్స్ రావడం
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- మెదడు వాపు (ఎన్సెఫాలిటిస్)
- కోమాలోకి వెళ్లడం
నిపా వైరస్ వేగంగా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి జ్వరంతో పాటు నాడీ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
Also Read: గ్లోబల్ రికార్డులను తిరగరాస్తున్న ‘చికిరి చికిరి’ సాంగ్
ఏ ఆహార పదార్థాల ద్వారా నిపా వైరస్ ముప్పు ఉంది?
తాటి/ఖర్జూర రసం: ప్రస్తుతం ఖర్జూర రసానికి వీలైనంత దూరంగా ఉండండి. ఈ రసంలో నిపా వైరస్ ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి బదులుగా బెల్లం తీసుకోవడం వల్ల ముప్పు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఖర్జూర రసాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద మరిగించి బెల్లం తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో వైరస్ నశిస్తుంది.
పండ్లు: గబ్బిలాలు పండ్లను కొరుకుతాయని గుర్తుంచుకోవాలి. అలా కొరకడం వల్ల నిపా వైరస్ పండ్లలోకి ప్రవేశిస్తుంది. ఆరోగ్యవంతులు ఆ పండ్లను తింటే వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందుకే పండ్లు తినేటప్పుడు జాగ్రత్త వహించాలి. పండ్లపై కొరికిన గుర్తులు ఉంటే వాటిని తినకండి. అలాగే పండును కోసినప్పుడు లోపల కుళ్ళినట్లు అనిపిస్తే ఆ భాగాన్ని తీసేసి తినకుండా పండును పూర్తిగా పారేయండి.
పోర్క్ (పంది మాంసం): నిపా వైరస్ వ్యాప్తి సమయంలో పంది మాంసం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మాంసాన్ని సరిగ్గా ఉడికించి తింటే ఇబ్బంది లేదు. కానీ సగం ఉడికిన మాంసం తినడం వల్ల ముప్పు పెరుగుతుంది.
పాటించాల్సిన నియమాలు
- పండ్లు లేదా కూరగాయలపై పక్షులు లేదా జంతువులు కొరికిన గుర్తులు ఉంటే వాటిని తినకండి.
- కూరగాయలు, పండ్లను తినే ముందు శుభ్రంగా కడగాలి.
- మాంసం పూర్తిగా ఉడికినట్లు నిర్ధారించుకోండి.
- తినడానికి ముందు చేతులను తప్పనిసరిగా కడుక్కోవాలి. కరోనా సమయంలో పాటించిన విధంగానే సేఫ్టీ ప్రోటోకాల్స్ అనుసరించాలి.
