మామూలుగా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు స్త్రీలలో కొన్ని రకాల మార్పులు రావడం అన్నది సహజం. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అలాగే డెలివరీ అయిన తర్వాత స్త్రీల శరీరంలో కొన్ని రకాల మార్పులు వస్తూ ఉంటాయి. అలా డెలివరీ అయిన తర్వాత కూడా చాలామంది స్త్రీలు లావుగా ఉంటారు. పొట్ట భాగం మొత్తం లావుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే డెలివరీ తర్వాత స్త్రీలు బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొన్ని రకాల తప్పులు కూడా చేస్తూ ఉంటారు. వాటి వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి డెలివరీ తర్వాత ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
డెలివరీ తర్వాత కొంతమంది బరువు గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది మీ బరువును మరింత పెంచేసి ఎన్నో రోగాలబారిన పడేలా చేస్తుందట. అయితే కొంత మంది మాత్రం బరువు తగ్గాలని డెలివరీ అయిన వెంటనే కొన్నిరోజుల గ్యాప్ లో వ్యాయామం చేస్తుంటారు. కానీ డెలివరీ అయిన 12 వారాల వరకు వ్యాయామం చేయకూడదట. ఈ సమయంలో బాగా విశ్రాంతి తీసుకోవాలని చెబుతిన్నారు. నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా విశ్రాంతి చాలా చాలా అవసరం అని చెబుతున్నారు..
ఈ మూడు నెలల్లో తల్లిగా వారిదృష్టి మొత్తం పిల్లల సంరక్షణపైనే ఉండాలట. కానీ మీరు వ్యాయామం చేయాలనుకుంటే మాత్రం 3 నెలలు ఆగాలని, ఇంతకంటే ముందు వ్యాయామం చేయకూడదని అది వారి ఆరోగ్యానికే మంచిది కాదని చెబుతున్నారు. మీరు వ్యాయామం చేయడం స్టార్ట్ చేసినప్పుడు మీ ఒత్తిడి స్థాయిలు, భావోద్వేగ ఉద్వేగాలపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు. బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం వల్ల మీ శక్తి తగ్గుతుందట. కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కువగా తింటారు. డెలివరీ అయిన వెంటనే బరువు పెరగడం, బెల్లీ ఫ్యాట్, మచ్చల గురించి ఆలోచించకూడదట. ఇలాంటి ఆలోచనలు ఉంటే మీ మనస్సులో నుంచి తీసేయడం మంచిదని చెబుతున్నారు.
మొదటి త్రైమాసికంలో మీరు మీ బిడ్డతో ఎక్కువ సమయం గడపడం అవసరం. ఈ సమయంలో మీరు శరీర ఆకృతి గురించి జాగ్రత్తలు తీసుకోకూడదట. తల్లి పాలిచ్చేటప్పుడు పౌష్టికాహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలట. బిడ్డకు పాలివ్వడానికి మీరు అదనంగా 600 కేలరీలను తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అందుకే కూరగాయలు, పండ్లు, మూడు గ్లాసుల పాలను తాగాలట. నీళ్లను కూడా ఎక్కువగా తాగాలి. తల్లిపాలలో కూడా నీరు ఎక్కువగా ఉంటుందని, ఈ సమయంలో మీకు సరిగ్గా నిద్ర ఉండదు. కాబట్టి వీలున్నప్పుడల్లా కంటినిండా నిద్రపోవాలని చెబుతున్నారు.
డెలివరీ అయిన మూడు నెలల తర్వాత…బరువు తగ్గాలనుకుంటే మీరు ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేయండి. రోజుకు కనీసం 8,000 నుంచి 10,000 అడుగులు నడవాలని చెబుతున్నారు. మీరు జిమ్ కు వెళితే మరీ ఎక్కువగా కష్టపడకూడదట. సైక్లింగ్, జాగింగ్ వంటివి చేయడం మంచిదట.అలాగే గర్భాశయం సాధారణ స్థితికి రావాలి. ఇందుకు ఆరు వారాల సమయం పడుతుందని చెబుతున్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మూడు నెలల తర్వాత కూడా మీ ఆరోగ్యం పూర్తిగా బాగుంది అని తెలుసుకున్న తర్వాతే గైనకాలజిస్ట్ను కలిసి ఆ తర్వాత వ్యాయామం చేయడం మొదలుపెట్టడం మంచిదని చెబుతున్నారు.