Urine Odour : మూత్రంలో అధిక వాసన రావడానికి కారణం ఏమిటంటే

మూత్రంలో చాలా ఎక్కువ వ్యర్థాలు (Waste) ఉన్నప్పుడు.. అందులో వాసన వచ్చే సమస్య తలెత్తుతుంది.

మూత్రంలో (Urine) అధిక వాసన వస్తోందా ? ఇలా ఎందుకు జరుగుతోందో తెలియక ఎంతోమంది ఇబ్బందిపడుతుంటారు ? మరేం లేదు.. మూత్రంలో చాలా ఎక్కువ వ్యర్థాలు ఉన్నప్పుడు.. అందులో వాసన వచ్చే సమస్య తలెత్తుతుంది. సాధారణంగా మీ శరీరం బాగా హైడ్రేట్ అయినప్పుడు, మూత్రంలో ఎలాంటి వాసనా రాదు. రోజులో చాలాసార్లు మందులు వాడటం వల్ల కూడా మూత్రంలో వాసన (Urine Odor) వచ్చే సమస్య తలెత్తుతుంది. అయితే మూత్రంలో వాసన రావడం అనేది తీవ్రమైన వ్యాధులకు సంకేతాన్ని సూచిస్తుంది. ఏయే వ్యాధులకు ఇది సంకేతం అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మధుమేహం:

మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి. డయాబెటిస్‌ ఉన్నప్పుడు శరీరం తగినంత ఇన్సులిన్‌ను తయారు చేయదు లేదా శరీరం తయారు చేసినంత ఎక్కువ ఇన్సులిన్‌ను ఉపయోగించదు. మధుమేహం సమస్య నియంత్రణలో లేనప్పుడు, మూత్రంలో వాసన రావడం ప్రారంభమవుతుంది. మూత్రంలో ఉండే చక్కెర కారణంగా ఈ రకమైన వాసన వస్తుంది. మీ శరీరం రక్తం నుంచి అదనపు చక్కెరను తొలగించడానికి ప్రయత్నిస్తోంది అనే దానికి ఈ రకమైన వాసన ఒక సంకేతం.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్:

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) అనేది పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపించే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. స్త్రీల మూత్రనాళం (మూత్రం వెళ్లే గొట్టం) పురుషుల కంటే చిన్న సైజులో ఉంటుంది. దీని కారణంగా మూత్రాశయంలో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మూత్రంలో వాసన వస్తుంది. మూత్రంలో బ్యాక్టీరియా మోతాదు అధికంగా ఉండటం వల్ల అమ్మోనియా వాసన వస్తుంది.

ప్రోస్టెటయిటిస్:

ప్రోస్టెటయిటిస్ అనే వ్యాధి వల్ల ప్రొస్టేట్ గ్రంధిలో వాపు వస్తుంది. దీని కారణంగా పురుషులు మూత్ర విసర్జనలో నొప్పిని, ఇతర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల కూడా మూత్రంలో కుళ్లిన గుడ్ల వాసన వస్తుంది.

కాలేయ సంబంధిత సమస్యలు:

కాలేయ సమస్యలు ఉన్నప్పుడు కూడా మూత్రంలో వాసన వస్తుంది. ఈ సమయంలో మూత్రంలో వాసన రావడమే కాకుండా, దాని రంగు సైతం మారుతుంది. సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ కాలేయ సంబంధిత వ్యాధి వస్తే.. మూత్రం ముదురు గోధుమ లేదా నారింజ రంగులోకి మారుతుంది.

సమస్యను ఎలా గుర్తించాలి?

మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు అనేది తెలుసుకోవడానికి ముందుగా దాని లక్షణాలను కనుగొనడం అవసరం. UTI, మధుమేహం, కాలేయ సంబంధిత వ్యాధులు, ప్రోస్టెటయిటిస్ సంకేతాలు కొన్నిసార్లు చాలా భిన్నంగా ఉంటాయి, తద్వారా మీరు వాటి లక్షణాలను సులభంగా గుర్తించవచ్చు. అయితే, ఏదైనా వ్యాధిని నిర్ధారించడానికి ఉత్తమ మార్గం వైద్యుడిని సంప్రదించడం. చెకప్, టెస్టుల ద్వారా మీకు ఏ వ్యాధి ఉందో వైద్యులు సులభంగా చెప్పగలరు.

Also Read:  FD Rates : కొత్త సంవత్సరం బంపర్ ఆఫర్.. 9.36% వడ్డీ ఇస్తున్న ఫైనాన్స్ కంపెనీ..