Site icon HashtagU Telugu

Cervical Cancer Serum: సర్వికల్ క్యాన్సర్ కు మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్ “qHPV”.. విశేషాలు, వాస్తవాలివి!!

మన దేశంలోని మహిళలను ఎక్కువగా వేధిస్తున్న క్యాన్సర్.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్!! దీనికి చెక్ పెట్టేందుకు స్వదేశీ వ్యాక్సిన్ ను భారత్ సిద్ధం చేసింది. దాని పేరే.. “qHPV”. qHPV అంటే క్వాడ్రి వాలెంట్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేశాయి.నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద 9-14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ టీకా ఇవ్వనున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ప్రారంభమవుతుంది. ఈ మేడ్ ఇన్ ఇండియా టీకా ఒక డోసు ధర రూ.200 నుంచి రూ.400 దాకా ఉంటుంది. ఇంతకుముందు మెర్క్ కంపెనీ ఈ టీకాను విడుదల చేసినప్పుడు ఒక డోసు ధర రూ.3వేలు. దాని కంటే ముందు గార్దసిల్ కంపెనీ ఈ టీకాను ఒక్కో డోసుకు రూ.10వేలు చొప్పున ఇండియాలో అమ్మింది.

సర్వైకల్ క్యాన్సర్ అనేది..

సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భాశయ ముఖద్వారంలో మొదలయ్యే ఒక రకమైన క్యాన్సర్. స్త్రీ గర్భాశయం కింది భాగంలో గర్భాశయాన్ని, యోనిని కలిపే సిలిండర్ ఆకారంలో ఉండే దానినే గర్భాశయ ముఖద్వారాం (సర్విక్స్) అంటారు. చాలా వరకు గర్భాశయ క్యాన్సర్లు గర్భాశయం బయటి ఉపరితలంపై ఉన్న కణాల నుంచి మొదలవుతాయి. సర్వైకల్ క్యాన్సర్ సోకడానికి అతి ప్రధానమైన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ). ఎక్కువమంది భాగస్వాములతో లైంగిక చర్యలో పాల్గొనడం, గర్భ నిరోధక మాత్రలు ఉపయోగించడం, వంశపారం పర్యంగా.. తదితర కారణాల ద్వారా ఇది సంక్రమించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

మన దేశంలో..

* గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (cervical cancer) కేసుల్లో నాలుగో వంతు కేసులు, మూడో వంతు మరణాలు మన దేశంలోనే సంభవిస్తున్నాయి.

* NCBI నివేదిక ప్రకారం, భారతదేశంలో ప్రతి 53 మంది మహిళల్లో ఒకరికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉంది.

* మన దేశంలో 100 మంది మహిళల్లో ఒకరు ఈ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

* 30 నుంచి 69 ఏళ్ల మధ్య వయసున్న మహిళల మరణాల్లో 17 శాతం దీని కారణంగానే జరుగుతున్నాయి.

* ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాల ప్రకారం.. 2019 నుంచి భారతదేశంలో సుమారు 42 లక్షల మంది మహిళలు సర్వైకల్‌ క్యాన్సర్‌ కారణంగా మరణించారు.

* సాధారణ రోగనిరోధక శక్తి ఉన్న మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. కానీ బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తికి 5 నుంచి 10 సంవత్సరాలు మాత్రమే పట్టవచ్చు.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ లక్షణాలు..

* నెలసరి సమయంలో అధికంగా రక్తస్రావం.

* మెనోపాజ్ తర్వాత, లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత.. కూడా రక్తస్రావం కావడం.

* పొత్తి కడుపులో నొప్పి రావడం, లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు-ఆ తర్వాత వెజైనా దగ్గర నొప్పి, మంట రావడం.

* దుర్వాసనతో కూడిన వెజైనల్ డిశ్చార్జి.

* పదే పదే యూరిన్‌కి వెళ్లాల్సి రావడంతో పాటు ఆ సమయంలో నొప్పిగా అనిపించడం.

* తరచూ కడుపుబ్బరం వేధిస్తున్నా, అలసట, నీరసం, విరేచనాలు.