Site icon HashtagU Telugu

Anemia : అనీమియా అంటే ఏంటీ..?అనీమియాపై ఉన్న అపోహలు.. వాస్తవాలు..ఏమిటో తెలుసుకుందాం..!

What is anemia? Let's find out the myths and facts about anemia!

What is anemia? Let's find out the myths and facts about anemia!

Anemia : ప్రపంచవ్యాప్తంగా అనీమియా ఆరోగ్య సమస్యగా తలెత్తుతున్న నేపథ్యంలో, భారతదేశం ఇందులో ప్రథమ స్థానంలో నిలవడం ఆందోళనకరం. ప్రత్యేకంగా భారతీయ మహిళలలో ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే (NFHS-5) 2019–21 నివేదిక ప్రకారం, 15-49 సంవత్సరాల వయస్సున్న మహిళల్లో 57 శాతం మంది అనీమియాతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. గర్భిణీ మహిళల్లో ఈ శాతం 52గా ఉండటం శోచనీయం. అనీమియా అనగా రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయి తగ్గిపోవడం. హిమోగ్లోబిన్ మన శరీరానికి ఆక్సిజన్ అందించే కీలక ప్రోటీన్. ఇది తక్కువైతే శరీరంలో బలహీనత, అలసట, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఇది గర్భస్రావం, పిండం బరువు తక్కువగా ఉండటం, ముందస్తు డెలివరీ వంటి ప్రమాదాలకు దారితీస్తుంది.

Read Also: Vinayaka Chavithi 2025 : మూడు తొండాలు ఉన్న ఏకైక వినాయకుడి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

వైద్య నిపుణుల ప్రకారం, అనీమియాకు ప్రధాన కారణం ఐరన్ లోపమే. కానీ ఇదే అంత కాదు. ఫోలిక్‌ ఆమ్లం, విటమిన్‌ B12 వంటి పోషకాల కొరత, మలేరియా, తలసీమియా వంటి వ్యాధులూ అనీమియాకు దారి తీస్తాయి. కొన్ని సందర్భాల్లో జీర్ణాశయ సంబంధిత వ్యాధుల కారణంగా శరీరం ఐరన్‌ను సరిగ్గా గ్రహించకపోవచ్చు. ఒక అపోహ ఏంటంటే… మాంసాహారం తినని వారు తప్పనిసరిగా రక్తహీనతకు గురవుతారు అనే అభిప్రాయం. నిజానికి, శాకాహారంలోనూ ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది. ఉదాహరణకు, బజ్రా, రాగి, పప్పులు, సోయా, పచ్చికూరలు, బెల్లం, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ వంటి పదార్థాల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శాకాహారులు సరైన ఆహార నియమాలు పాటిస్తే రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. మరో అపోహ ఏమిటంటే ఇది పెద్ద సమస్య కాదు, సహజంగా వస్తుంది పోతుంది అని కొందరు ఊహించటం. కానీ అనీమియా లక్షణాలు మొదట చిన్నవిగా కనిపించినా, దీర్ఘకాలంగా కొనసాగితే శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

తలనొప్పి, దృష్టిలో అస్పష్టత, శారీరక శక్తిలో తగ్గుదల వంటి సమస్యలతోపాటు, చిన్నపిల్లలలో అభివృద్ధిలో విఘాతం కూడా చోటు చేసుకోవచ్చు. ఈ పరిస్థితులన్నింటిని దృష్టిలో ఉంచుకుని, వైద్యులు ప్రజలలో అవగాహన పెంపుదలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. అనీమియా గురించి సరైన సమాచారం అందించి, అపోహలను తొలగించి, జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. సరైన ఆహారం, తగిన సప్లిమెంట్లు, ఆరోగ్య పరీక్షలు ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చు. గర్భిణులు ప్రీ-నాటల్ చెకప్‌లలో తప్పకుండా హిమోగ్లోబిన్‌ స్థాయిని పరీక్షించించుకోవాలి. స్కూల్ బాలికలు, యువతులు కూడా వారికే ప్రత్యేకంగా రూపొందించిన ఐరన్ సప్లిమెంట్లను వైద్యుల సూచన మేరకు తీసుకోవాలి. ఇక, కుటుంబాల్లో పెద్దలు సైతం ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాలి. బలమైన రోగనిరోధక శక్తికి, ఆరోగ్యవంతమైన జీవితానికి హిమోగ్లోబిన్ స్థాయిలు కీలకం. అనీమియా మీ శరీరాన్ని మెల్లగా కలుస్తూ వచ్చే నిశ్శబ్ద విపత్తు. కనుక దీన్ని అలసత్వంతో, అపోహలతో ఎదుర్కోవడం ప్రమాదకరం. ఇక,నైనా మేలుకోవాలి… అనీమియా వ్యాప్తిని అడ్డుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటను జీవన విధానంగా మలచుకోవాలి.

Read Also: Jaggery And Turmeric : బెల్లంతోపాటు ఈ ఒక్కటి కలిపి తింటే శరీరానికి ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?!